Apr 25,2023 12:37

న్యూఢిల్లీ : సర్కస్‌ లెజెండ్‌ మూర్క్‌త్‌ వెంగకండి 'జెమిని' శంకరన్‌ (99) ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కేరళలోని పయ్యాంబలమ్‌లో మంగళవారం జరగనున్నట్లు మీడియావర్గాలు పేర్కొన్నాయి. ఈయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్‌... శంకరన్‌ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రపంచవ్యాప్తంగా ఇండియన్‌ సర్కస్‌ ప్రాచుర్యం పొందడానికి శంకరన్‌ ప్రధాన పాత్ర పోషించాడు. సర్కస్‌లో కొత్త కొత్త పద్ధతులను అవలించాడు. చూపరులను ఆకట్టుకునేలా విదేశీయులను, రకరకాల టెక్నిక్స్‌ను ఆయన ప్రయోగించాడు' అని శంకరన్‌ ప్రతిభను కొనియాడారు.
కాగా, శంకరన్‌ 1924లో కేరళలోని కన్నూర్‌ జిల్లాలో తలస్సెరీ సమీపంలో కొలాస్సెరీ గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే ప్రముఖ సర్కస్‌ కళాకారుడు కీలేరి కున్హికన్నన్‌ వద్ద మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత సైన్యంలో చేరి దేశ సేవ చేశారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో సైతం పాల్గొన్నారు. శంకరన్‌ కలకత్తాలోని బాస్‌ లయన్‌ సర్కస్‌ కంపెనీలో మొదటగా సర్కస్‌ చేయడం ప్రారంభించారు. ఈ కంపెనీలో మంచి ట్రాపెజిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ సర్కస్‌ గ్రూపులతో కలిసి ఆయన పనిచేశారు. 1951లో విజయా సర్కస్‌ కంపెనీని కొనుగోలు చేసి.. దానికి 'జెమినీ' సర్కస్‌ అని పేరు పెట్టారు. ఈ కంపెనీ మొట్టమొదటి సర్కస్‌ షో 1951 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్‌లోని బిలిమోరాలో ప్రారంభమైందని కేరళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈయన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వారిలో జూనియర్‌ మార్టిన్‌ లూథర్‌కింగ్‌, లండన్‌ ప్రముఖురాలు సామాజిక కార్యకర్త అయిన కౌంటెస్‌ మౌంట్‌ బాటెన్‌, సోవియనట్‌ వ్యోమగాములు యూరీ గగారిన్‌తోపాటు వాలెంటనీ టెరిష్కోవాలు వంటి ప్రముఖులు ఆయన అభిమానులుగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా శంకరన్‌ సర్కస్‌ను చూసి ముగ్ధులయ్యేవారు. ఈయన ప్రత్యేకించి సింహాలతో చేసే ప్రయోగాత్మకమైన సర్కస్‌కు ఇందిరాగాంధీ తనవంతు సాయమందించారట. ఓసారి బీహార్‌లో జరిగే సర్కస్‌ షోకి సింహాలను రైళ్లలో తీసుకెళ్లేందుకు ఆమె అనుమతించారు. సర్కస్‌ల్లో జంతువుల వినియోగాన్ని పరిమితం చేస్తూ చట్టాల్లో మార్పులొచ్చాయి. ఆ సమయంలో ఆయనతో ఉన్న జంతు ప్రదర్శనకారుల బృందానికి వాయనాడ్‌ అడవుల్లో నివాసాల ఏర్పాటుకు కృషి చేశాడు.