Sep 23,2022 21:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రెండు మండల విద్యాశాఖ అధికారి (ఎంఇఒ) పోస్టుల నియామకం ఉమ్మడి సర్వీస్‌ నిబంధనలు ఆధారంగా స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని యుటిఎఫ్‌ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టరు మువ్వా రామలింగంను ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. పలు అంశాలపై జాయింట్‌ డైరెక్టరుతో చర్చించారు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ.. 5 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 3,450 ఉన్నత పాఠశాలల్లో మ్యాపింగ్‌ చేశామని చెప్పారు. 292 జూనియర్‌ కళాశాలల్లో 998 ప్రధానోపాధ్యాయ పోస్టులకు, 4,500 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతిచ్చిందన్నారు. డిప్యూటీ ఇఒ పోస్టులను 50శాతం పదోన్నతుల ద్వారా, 50 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమిస్తామని తెలిపారు. బదిలీల ఫైల్‌ సిఎం కార్యాలయంలో ఉందని వివరించారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సంబంధించి డిడిఒ అధికారాల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థలకు రెవెన్యూ మండలాల ఆధారంగా 4 ఎంఇఒ పోస్టుల ఇచ్చామని తెలిపారు. మిగిలిన నగర పాలక సంస్థలకు 2 ఎంఇఒ పోస్టులను మంజూరు చేస్తామని వివరించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం విలీన ప్రక్రియ జిఒ 177 వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందదని, యుటిఎఫ్‌ చెప్పిన విషయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని రామలింగంకు నాయకులు తెలిపారు. దీనివల్ల విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. 117ను సమగ్రంగా సవరణ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ఇంతవరకు సవరణ చేయకుండా రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టారని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రేషనలైజేషన్‌, బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను అర్థం చేసుకుని విలీన ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరారు. జెడిని కలిసిన వారిలో ఫెడరేషన్‌ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, కార్యదర్శులు బి లక్ష్మిరాజా, ఎ కృష్ణసుందరరావు పాల్గన్నారు.