Dec 08,2022 21:03

ప్రజాశక్తి- సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఎఒబి)లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ కమల ఉన్నట్టు పోలీసాధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఎస్‌ఒజి, డిఒఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు తాడికోల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. వాటికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరిని కమలగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలంలో భారీ ఆయుధ సామగ్రిని ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.