May 27,2023 09:13

రంగన్న సిటీ నుంచి ఒక ఆవును కొన్నాడు. దాని పేరు ట్రిక్కి. ఆవుల్లో కెల్లా చాలా ధైర్యవంతురాలు, తెలివైనది. ట్రిక్కి కొన్నాళ్లకు ఒక దూడకు జన్మనిచ్చింది. తర్వాత ఎప్పటిలాగే ట్రిక్కి అన్ని ఆవులతో కలిసి హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్ళింది.
ట్రిక్కి పాటలు వింటూ మేతమేస్తుండగా, ఒక సింహం గట్టిగా గాండ్రిస్తూ అటువైపు వచ్చింది. సింహం రాకను గమనించిన ఆవులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. ట్రిక్కి పాటలు వింటూ ఎంజారు చేస్తుండటం వల్ల సింహాన్ని గమనించలేదు. సింహం ట్రిక్కిని చూసి 'ఆహా! ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది' అనుకుంటూ ట్రిక్కి ముందుకు వెళ్లి నిలబడింది. ట్రిక్కి సింహాన్ని చూసి...చిన్నగా నవ్వింది. తనని చూసి భయపడకపోగా... ఆవు ఎందుకు నవ్విందో సింహానికి అర్థం కాలేదు.
సింహం కోపంతో ''ఎందుకు నవ్వుతున్నావ్‌?'' అని అడిగింది.
అప్పుడు ట్రిక్కి 'నేనేమెనా పాత కాలపు ఆవునని అనుకుంటున్నావా? నిన్ను చూసి భయపడి పారిపోవడానికి' అంటూ తన మొబైల్‌ తీసి సింహాలను జూలో, సర్కస్లో ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూపించింది. 'చూశావా! నీ జాతి వాళ్ళని ఎలా బంధించారో, నేను ఒక కాల్‌ చేస్తే నీ పరిస్థితి కూడా అంతేమరి! కాల్‌ చేయమంటావా?' అంది ట్రిక్కి. వెంటనే సింహం ట్రిక్కి కాళ్ళ మీద పడి 'దయచేసి అంత పని చేయొద్దు. నేనింకెప్పుడూ మీ జోలికి రాను' అని అక్కడినుంచి పారిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనించిన ఆవులన్నీ ట్రిక్కి తెలివిని మెచ్చుకొని అభినందించాయి.
- ఎం.హర్షియ,
10వ తరగతి,
ఎం.తిమ్మాపురం, ఆదర్శ పాఠశాల,
మహానంది (మం), నంద్యాల జిల్లా.