Oct 05,2022 19:20

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌): బాపట్ల సూర్యలంక బీచ్‌లో ప్రమాదవశాత్తు గల్లంతై మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, టిడిపి ఆధ్వర్యంలో విజయవాడ పైపులు రోడ్డు జంక్షన్‌ వద్ద విద్యార్థుల మృతదేహాలతో బుధవారం ధర్నా నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైసిపి నేతలు మృతుల కుటుంబాలకు సాయం అందిచకపోగా దాడులకు దిగారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న సిపిఎం, టిడిపి, విద్యార్థి సంఘాల నాయకులను, మృతుల బందువులను అరెస్టు చేసి నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌ అయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.రమణరావు, కే. దుర్గారావు, నగర్‌ నేతలు సిహెచ్‌.శ్రీనివాస్‌, నిజాముద్దీన్‌, హనుమంతరావు, టిడిపి నాయకులు దాసరి దుర్గారావు, దాసరి ఉదయశ్రీ మొత్తం 16 మందిని అరెస్టు చేశారు.
నందిగామ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన
సిపిఎం, టిడిపి, విద్యార్థి సంఘాల అక్రమ అరెస్టును నిరసిస్తూ నందిగామ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిపిఎం, టిడిపి స్థానిక నేతలు నిరసనకు దిగారు. నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేస్తూ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.