May 29,2023 10:26
  • రిపబ్లికన్లతో బైడెన్‌ ఒప్పందం
  • ప్రస్తుతానికి దివాలా
  • ముప్పు తప్పినట్టే

వాషింగ్టన్‌ : అమెరికా అప్పుల పరిమితి పెంపునకు సంబంధించి ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు, ప్రతినిధుల సభలో మెజార్టీగా వున్న రిపబ్లికన్లకు మధ్య రాజీ కుదిరింది. దీంతో దివాలా అంచుకు చేరిన అమెరికా ఊపిరిపీల్చుకుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా శ్వేత సౌధానికి, ప్రతినిధుల సభ స్పీకర్‌ మెక్‌కార్దీకి మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇద్దరూ రాజీకి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం అమెరికన్‌ ప్రజలకు చాలా విలువైనదిగా ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బైడెన్‌ ఒక ప్రకటన చేస్తూ. 'ఈ ఒప్పందం రాజీనీ సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు కావాల్సింది పొందలేరు' అని వ్యాఖ్యానించారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా.. సెనెట్‌లో డెమొక్రాట్ల ఆధిక్యం ఉంది. ఈ ఒప్పందం జూన్‌ 5వ తేదీలోపు కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత బైడెన్‌ దీనిపై సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. ఒకవేళ అప్పటిలోగా ఈ ఒప్పందం అమల్లోకి రాకపోతే.. జూన్‌ 5వ తేదీ తర్వాత నుంచి అమెరికా అప్పులు చెల్లించే పరిస్థితిలో ఉండదని ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.అమెరికా అప్పుల భారం 28.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది ఆ దేశ జిడిపి కన్నా 24 శాతం అధికం.