Sep 18,2023 12:29

న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ... సోమవారం ఉదయం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిలు, మాజీ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ' సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ ', 'విరు వాంట్‌ జస్టిస్‌' అంటూ నినదించారు.ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్‌ పై దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే పార్లమెంటు భవనం వద్ద ధర్నా చేపట్టామని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్‌ జగన్‌ రాక్షస క్రీడలో ఓ భాగమని విమర్శించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనేక విచారణలు జరిపారని, కానీ, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయమని అన్నారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఏపీ పరిస్థితే అందుకు ఉదాహరణ అని అన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, ఏపీలో జరుగుతున్న విధ్వంసక పాలనపై కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ... ఎపిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిరసనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎంపిలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, మాజీ ఎంపిలు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, మురళీమోహన్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, బీకే పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.