Aug 09,2022 20:59

ప్రజాశక్తి-యంత్రాంగం :పార్లమెంటులో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ రైతు, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చేశారు. బిల్లు ప్రతులను దహనం చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినదించారు. కాకినాడలోని సుందరయ్య భవన్‌ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం, నేడు ఆ హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును దొడ్డిదారిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం రైతులను మోసం చేయడమేనన్నారు. ఈ బిల్లు వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బిల్లు ప్రతులను దహనం చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించి, ప్రదర్శనగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. విద్యుత్‌ సవరణ బిల్లు కాపీలను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, బిఎన్‌ కండ్రిగలలో బిల్లుల ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.