Nov 30,2022 10:41
  • తేమ శాతం ని'బంధనాలు'తో తప్పని కష్టాలు
  • వారం రోజులు ఆరబెడితేనే కొనుగోలు
  • రైతుకు తడిసి మోపెడవుతున్న ఖర్చులు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : అప్పులు చేసి ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తేమ శాతం నిబంధన ధాన్యం వెంటనే అమ్ముకోవడానికి అడ్డంకిగా మారింది. నూర్పిడి అయిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే వారం రోజులపాటు పూర్తిగా ఆరబెడితేనే ఆర్‌బికెల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో, ఆరబెట్టేందుకు అదనపు ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.37 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1.65 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. దాదాపు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిలో ఇప్పటి వరకు 43,967 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. తేమ కారణంగా మిగిలిన ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. దీంతో. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో పడ్డారు.
 

                                                                         అదనపు ఖర్చులు

ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా పలు నిబంధనల వల్ల రైతులకు అదనపు ఖర్చులు తప్పడం లేదు. వాతావరణ అననుకూల పరిస్థితుల్లో ఎక్కువమంది రైతులు యంత్రాల ద్వారా వరి కోతలను పూర్తి చేస్తున్నారు. ఈ ధాన్యంలో 17 శాతం మించి తేమ ఉంటోందంటూ అధికారులు కొనుగోలు చేయట్లేదు. దీంతో, పంట కోసినప్పటి నుంచి దాదాపు వారం రోజులు ఆరబెట్టాల్సి వస్తోంది.

ఒక ఎకరా ధాన్యం ఆరబోతకు రోజుకు పది టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. ఒక్కో టార్పాలిన్‌కు రోజుకు రూ.15 అద్దె చెల్లించాలి. ఇలా వారం రోజులకు రూ.1,050, అరబోతకు కూలి ఖర్చులతో కలుపుకొని ఎకరాకు రూ.6,650 నుంచి రూ.8,050 అవుతోందని రైతులు చెబుతున్నారు. ధాన్యంలో వ్యర్థాలను తొలగించే బాధ్యత కూడా రైతులదే. ఇలా అదనపు ఖర్చులు భరించలేని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.

Conditions-for-six



                                                                   ఐదు రోజులుగా ఆరబెడుతున్నాను

నేను మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. అల్పపీడనంతో వరి కోత యంత్రం ద్వారా పూర్తి చేశాను. తేమ శాతం ఎక్కువ ఉందంటూ అధికారులు చెప్పడంతో ఐదు రోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నాను. మరో రెండు రోజులు ఆరబెడితేనేగానీ ధాన్యం కొనలేమని చెబుతున్నారు రోజుకు కూలి ఖర్చులు, టార్పాలిన్ల అద్దె, ఇతర ఖర్చులు కలిసి రూ.1,150 వరకూ ఖర్చు అవుతోంది.
                          - వాసంశెట్టి కోటేశ్వరరావు, కౌలు రైతు,
                          చంద్రంపాలెం, సామర్లకోట మండలం

 

Conditions-for-six




                                                                      నిబంధనలు సడలించాలి

ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాను. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేశాను. తేమ శాతం నిబంధనతో వారం రోజులుగా ధాన్యాన్ని జాతీయ రహదారిపై ఆరబెడుతున్నాను. టార్పాలిన్లకు, కూలి, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
                                                                                        - అత్తిలి సూర్యనారాయణమూర్తి, రైతు,
                                                                                              సర్పవరం, కాకినాడ రూరల్‌