Sep 30,2022 11:04
  • కనిపించని గ్రూపులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర అయోమయం నెలకొంది. కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చిన మూడు నెలల తరువాత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి మంగళవారం నుంచి మొదలుపెట్టింది. అక్టోబరు 5 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే విద్యార్థులకు నచ్చిన గ్రూపులు వెబ్‌ ఆప్షన్లలో కనిపించడం లేదు. ఎపిసిఎఫ్‌ఎఫ్‌ఎస్‌ కోడింగ్‌లో వచ్చిన ఇబ్బందే ఇందుకు కారణమని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను విద్యామండలి ఎపిఆన్‌లైన్‌కు అప్పగించింది. కళాశాల గుర్తింపు, కోర్సుల కోడింగ్‌ను ఎపిసిఎఫ్‌ఎఫ్‌ఎస్‌కు అప్పగించింది. ఈ కోర్సులకు కోడింగ్‌ ఏర్పాటు చేసే విషయంలో ఎపిసిఎఫ్‌ఎఫ్‌ఎస్‌లో వచ్చిన ఇబ్బంది వల్లే గ్రూపులు కనపడటం లేదు. దీంతో ఇష్టమొచ్చిన గ్రూపులో కాకుండా.. ఆన్‌లైన్‌లో ఉన్న గ్రూపులకు మాత్రమే విద్యార్థులు ఆప్షన్‌ ఇస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. మొదటి మూడు రోజుల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మరలా అవకాశం ఇస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. కోడింగ్‌ సమస్య పూర్తికాగానే కనపడని కోర్సులను కూడా చేర్చి విద్యార్థులకు సమాచారం అందించడంతోపాటు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామంటుంది.
 

                                                     కౌన్సెలింగ్‌ పూర్తికాకుండానే తరగతులు ప్రారంభం

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకుండానే మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కౌన్సెలింగ్‌ పూర్తికాకుండానే ప్రైవేటు కళాశాలలు నెల రోజుల నుంచి తరగతులను ప్రారంభించాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఫోన్‌ నెంబర్లను, వారి వివరాలను ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు తీసుకున్నాయి. కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రైవేట్‌ కళాశాలలే పూర్తి చేస్తున్నాయి. వెబ్‌సైట్‌లో విద్యార్థుల పేరుతో లాగిన్‌ అయి వారి కళాశాల పేరును, అప్పటికే చదువుతున్న విద్యార్థి గ్రూపును కళాశాలలకు చెందిన సిబ్బంది నమోదు చేస్తున్నారు. కౌన్సెలింగ్‌లో ఒకవేళ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న కళాశాలలో సీటు రాకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.