
- ఇకెవైసి, ఇ-క్రాప్ బుకింగులో లోపాలు
- కొందరికి అతి తక్కువగా పరిహారం మంజూరు
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5,508 దరఖాస్తులు
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : వైఎస్ఆర్ ఉచిత రైతు బీమా పరిహారం కొందరు అర్హులకు అందకుండా పోయింది. పరిహారం మంజూరులో గందరగోళం, అయోమయం నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.885.75 కోట్లు మంజూరయ్యాయి. దీని పంపిణీ ప్రారంభమయ్యే సరికి అనేక లోటుపాట్లు, లోపాలు కనిపిస్తున్నాయి. అనేకమంది రైతులకు బీమా అందలేదు. కొంతమంది రైతుల సాగు విస్తీర్ణం తగ్గించి చూపించడంతో పరిహారం నామమాత్రంగా పడింది. దీంతో, రైతుల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టడంతో అధికారులు స్పందించి ప్రత్యేకమైన గ్రీవెన్స్‌ను మూడు రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 5,508 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటిలో అనంతపురం జిల్లాకు సంబంధించి 3,198, సత్యసాయి జిల్లాకు సంబంధించి 2,310 ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి 1,428 దరఖాస్తులను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. ఇకైవెసి, ఇ-క్రాప్ బుకింగు కాలేదనే సాంకేతిక కారణాలతో 1,770 దరఖాస్తులను తిరస్కరించారు. సత్యసాయి జిల్లాలో దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది.
ఇకెవైసి, ఇ-క్రాప్ బుకింగు లేకపోతే అంతే...
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా ఇ-క్రాప్ బుకింగు, ఆ తరువాత ఇ-కెవైసి ఉండాలి. ఇవి లేకపోతే పంటల బీమా వచ్చే అవకాశమే లేకుండాపోయింది. క్షేత్ర స్థాయిలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఇవి సక్రమంగా చేయకపోవడంతో అర్హత ఉన్నా బీమా జాబితాలో పేరు చేరలేదు. ఈ రకంగా సుమారు 40 వేల మంది లబ్ధి పొందలేకపోయినట్లు జిల్లా పరిషత్తు సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ తెలిపారు.
25 మండలాలకు రాని వేరుశనగకు బీమా
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉంటే 25 మండలాల్లో వేరుశనగ పంటకు పంటల బీమా రాలేదు. సత్యసాయి జిల్లాలో 18 మండలాలు, అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు వీటిలో ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంటే. ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట గత ఖరీఫ్‌లో సాగైంది. దీనికి వాతావరణ బీమాను అమలు జరిపారు. పంట దిగుబడికి కీలకమైన ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చివరలో నూర్పిడి సమయంలో అక్టోబరులో అధిక వర్షాలు పడ్డాయి. రెండింటి వల్ల రైతులు నష్టపోయారు. వాతావరణ బీమా ప్రకారం వర్షాలు బాగా పడినందున బీమా పరిహారం ఇవ్వలేదు. వచ్చిన చోట కూడా ఎకరానికి రూ.800 నుంచి రూ.2500 లోపు మాత్రమే ఉంది.
యాప్‌లో ఆన్లైన్ నమోదులోనూ లోపాలు
బీమా వివరాలను నమోదు చేసేందుకు యాప్‌లు రూపొందించారు. ఈ యాప్‌లోనే పంటల వివరాలు నమోదు చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ యాప్‌లో నమోదు చేసిన తరువాత విస్తీర్ణం నమోదు చేసిన దానికంటే తక్కువగా అయింది. ఉదాహరణకు జిల్లాలోని పుట్లూరు మండలం కందిగోపుల గ్రామంలో ఎ.వెంకటరామిరెడ్డి అనే రైతు 1.80 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. దీన్ని ఇ-క్రాప్ బుకింగు, ఇకెవైసి చేశారు. పరిహారం మంజూరు జాబితాలోకి వచ్చే సరికి ఒక సెంటు కింద మాత్రమే నమోదయి వచ్చింది. దీంతో, రూ.3 వేలు మాత్రమే పరిహారం వచ్చింది. శింగనమల మండలంలోని ఆనందరావుపేట గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే, పరిహారం మంజూరు జాబితాలో ఒక సెంటు మాత్రమే నమోదైంది. దానికి ఎనిమిది రూపాయలు మాత్రమే మంజూరైంది. ఈ రకంగా జిల్లాలో అనేక మంది రైతులకు లోటుపాట్లు చోటు చేసుకున్నాయి.