
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని సిడబ్ల్యుసి డిమాండ్ చేస్తోందని సీనిరయర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా బిల్లుపై గత కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవను ప్రశంసించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1989 మేలో పంచాయితీలు, మునిసిపాలిటీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారని అన్నారు. ఆ బిల్లు అప్పట్లో లోక్‌సభ ఆమోదం పొందినప్పటికి.. రాజ్యసభలో వీగిపోయింది. 1993లో ప్రధాని పి.వి. నరసింహారావు తిరిగి ఆ బిల్లుని ప్రవేశపెట్టారని, ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంగా రూపొందిందని అన్నారు. దీంతో ప్రస్తుతం పంచాయితీలు, మునిసిపాలిటీల్లో 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు సేవలందిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకువచ్చారని.. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగా, లోక్‌సభలో అడ్డంకులు ఎదురయ్యాయని అన్నారు. ఆ బిల్లుని లోక్‌సభ ఆమోదించాలని గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని జైరాం రమేష్ పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనైనా ఈ బిల్లుని ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.