
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ధ్రువీకరణ, స్వచ్ఛీకరణ పేరుతో ఓటరు కార్డు - ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరో మారు తెరపైకి తీసుకొచ్చింది. 2015 లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినా.. అప్పట్లోనే సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసి ఆ ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ నిలిపివేసింది. ప్రజల గోప్యత హక్కు మాటేంటని కూడా నిలదీసింది. ఆధార్ అనుసంధానికి వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి 2021లో తీసుకొచ్చిన సవరణల ద్వారా ఇప్పుడు మళ్లీ ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ముందుకు తేవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదంటూ న్యాయస్థానాలకు సమర్పించే ప్రమాణ పత్రాల్లోనూ, విలేకర్ల సమావేశాల్లోనూ ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. కానీ క్షేత్రస్థాయి అధికారులు మాత్రం తప్పనిసరి అంటూ అనుసంధాన ప్రక్రియను ముమ్మరంగా చేపడతారు. ఈ ప్రక్రియను చేపట్టే ముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కానీ, న్యాయ నిపుణులతో కానీ ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపింది లేదు. మార్గదర్శకాలు, నియమాలు విడుదల చేయలేదు. ఇంతటి గందరగోళ పరిస్థితుల నడుమ అనుసంధాన ప్రక్రియను కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండాలని కోరుకోవడంలోనూ, అర్హులందరినీ ఓటర్లుగా గుర్తించాలని, లేదా నకిలీ ఓటర్లను ఏరివేయాలనే అంశాలపై ఎవ్వరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. కానీ స్వచ్ఛీకరణ, ధ్రువీకరణ పేరిట అర్హులైనవారినీ అనర్హులు చేసే ఎటువంటి చర్య అయినా అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమౌతుంది.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు. పౌరులకు ఓటు హక్కు కల్పనలో ఎటువంటి తారతమ్యాలు చూపినా, వివక్ష చూపినా, అక్రమాలు జరిగినా అది ప్రజాస్వామ్య పునాదికే చేటు తెస్తుంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసి సకాలంలో సరైన రీతిలో ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకే ఎన్నికల నిర్వహణ వ్యవస్థను కార్యానిర్వాహక విభాగంలో కలిపేయకుండా వేరుగా, స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చేశారు. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి మిగిలిన స్వతంత్ర సంస్థలను దుర్వినియోగపరుస్తున్నట్లుగానే ఎన్నికల సంఘాన్ని కూడా తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తెర మీదకు వచ్చిన ఓటరు కార్డుల ధ్రువీకరణ, స్వచ్ఛీకరణ ప్రక్రియ వెనుక కూడా బిజెపి అనేక రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వచ్ఛీకరణలో భాగంగా ఇప్పటికే వివిధ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల వద్ద పోగుబడిన ఆధార్ డేటాను వ్యక్తుల సమ్మతి లేకుండానే ఓటర్ల జాబితాకు లింక్ చేయడం ద్వారా ఎన్నికల సంఘమే నేరుగా అనుసంధానం చేసిందన్న కథనాలు ఆందోళన రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 31 కోట్ల మంది ఓటర్ల డేటాను, ఆధార్‌తో అనుసంధానించినట్లు వెల్లడైంది. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గత 2019లో ఏకంగా 55 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించి నిర్ధారించాల్సివుంది. కానీ ఈ ఆధార్ ఆటోమేటిక్ అనుసంధాన ఫలితంగా అర్హులైన లక్షలాది మంది అనర్హులుగా మారిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి కచ్చితంగా చేటు చేయడమే. ఇలాంటి ఆటోమేటిక్ అనుసంధాన విధానాల వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడేందుకు వీలుంటుంది. మరోవైపు ఆధార్ అధీకృత సంస్థ అయిన యుఐడిఎఐ ఆధార్ నంబరు కనిపించకుండా మాస్క్‌డ్ కార్డులను జారీ చేస్తూ ఆధార్ దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఆధార్ అధికృత సంస్థే ఇన్ని జాగ్రత్తలు సూచిస్తుంటే ఎన్నికల సంఘం ప్రభుత్వ సంస్థల వద్ద పోగుబడిన ఆధార్ డేటాను ఓటరు జాబితాల డేటాతో లింక్ చేయడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పారదర్శకత తప్పనిసరి. అందువల్ల 2021 కంటే ముందు ఓటర్ల అనుమతి లేకుండా సేకరించిన డేటాను తొలగించి స్పష్టమైన మార్గదర్శకాలతో పౌరుల గోప్యత హక్కుకు భంగం వాటిల్లబోదన్న భరోసా ఇచ్చేవరకూ ఎన్నికల సంఘం ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియను నిలిపేయాలి.