Dec 08,2022 21:41

ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని నిర్వాసిత గ్రామాలైన తెల్లవారం, సిరివాక పునరావాస కాలనీల్లో ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్‌ ప్రవీణ్‌ఆదిత్యతో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసిత కాలన్లీలో పలుప్రాంతాలను పరిశీలించారు. పరిహారం, తదితర అంశాలపై చర్చించారు. గ్రామాలకు కావాల్సిన వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు పలు సమస్యలను కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగం చేసిన తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వాపోయారు. తమకు సరైన వసతులు లేవని, వీధిలైట్లు, తాగునీరు, శ్మశానవాటిక వంటి కనీస వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట పిఅర్‌డిఇ సీతయ్య, తహశీల్దార్లు ఎలీష, సుమతి, సచివాలయం సిబ్బంది ఉన్నారు.