Oct 05,2022 09:16

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధమే కానీ ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. నామినేషన్‌ తిరస్కరణ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ప్రాథమిక హక్కు ఉల్లంఘన కాబోదని జస్టిస్‌ సిహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్ తీర్పు చెప్పారు. నామినేషన్‌ తిరస్కరణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ దాఖలు చేసేందుకు వీల్లేదని, ఎపి సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ కింద జిల్లా కోర్టులో తేల్చుకోవాలని చెప్పింది. పిటిషనరు వివాదాన్ని ఆరు నెలల్లోగా పరిష్కరించాలని జిల్లా కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఎన్నికల్లో ఓటర్లు జాబితాలోని సీరియల్‌ నెంబర్‌తో తన పేరు సరిపోల లేదని చెప్పి ఎన్నికల అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించడం చెల్లదంటూ రెవెన్యూ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా చేసే సి వాసుదేవరావు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నమెంట్‌ ప్లీడర్‌ ప్రతివాదన చేస్తూ.. ఎపి సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌కు లోబడి ఎపి సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం ఏర్పడిందని, కాబట్టి విచారణ పరిధి హైకోర్టు కాదన్నారు. ఎన్నికల తర్వాత జిల్లా కోర్టులో తేల్చుకోవాలన్నారు. వాదనల తర్వాత రిట్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది.