Mar 18,2023 20:33

పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌
ప్రజాశక్తి-రాయచోటి :
పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించి పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ నాలుగో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల్లోని కొన్ని ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేయకపోవడంతో ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సిలబస్‌ పూర్తి కాకుండా ఫార్మేటివ్‌ 4 పరీక్షను విద్యార్థులు ఎలా రాస్తారని నిలదీశారు. క్లాస్‌ టీచర్‌పై హెచ్‌ఎం, ఎంఇఒ, డిప్యూటీ డిఇఒ పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎం, ఎంఇఒ, డిప్యూటీ డిఇఒలపై చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు. కో-ఆపరేటివ్‌ కాలనీలోని మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నిల్వ ఉంచిన కోడిగుడ్లు, చిక్కిల్లో క్వాలిటీ, ఎక్స్పైరీ డేట్‌లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, తీరు తెన్నులు పరిశీలించి స్వయంగా విద్యార్థికి గోరుముద్దను తినిపించి రుచి చూశారు. ఈ తనిఖీలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, డిఇఒ పురుషోత్తం, డిప్యూటీ డిఇఒ వరలక్ష్మి, ఎంఇఒ రమాదేవి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.