Jul 04,2022 18:50

ప్రస్తుతం చాలామంది మధుమేహం (డయాబెటిస్‌) వ్యాధితో బాధపడుతున్నారు. చక్కెరస్థాయి పెంచే ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రకాల జంక్‌ ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌ వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగి వ్యాధి మరింత తీవ్ర రూపం దాల్చుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు మొలకల ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల జీవక్రియ మెరుగుపడి.. రక్తంలో చక్కెరను వేగంగా తగ్గిస్తుందని వారి మాట.

- నానబెట్టిన శనగల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండి, శక్తి లభిస్తుంది. పోషకాలు కూడా అందుతాయి. అయితే డయాబెటిస్‌ వారు భోజనానికి ముందు మొలకెత్తిన శనగలను తింటే భోజనం తరువాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు.

- ప్రతిరోజూ గుప్పెడు పెసర పప్పు నానబెట్టుకుని తింటుండాలి. విటెక్సిన్‌, ఐసోవిటెక్సిన్‌ అనే కొన్ని యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ మొలకెత్తిన పెసరలో ఫైబర్‌, ప్రోటీన్‌ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.

- మొలకెత్తిన సోయాబీన్స్‌ వల్ల షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మేలుంటుంది. సోయాబీన్‌లో ప్రోటీన్‌, ఫైబర్‌, ఖనిజాలు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. ఇవి పొట్టకు, శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.