
- ప్రాంతీయ వైషమ్యాలను పెంచడం దారుణం
- ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యాచరణ : ఎంఎ గఫూర్
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : సామాన్య ప్రజలపై పన్నులు పెంచితే దేశవ్యాప్త నిరసనలు, ఉద్యమాలు చేపడతామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ పేర్కొన్నారు. కడపలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ధనవంతులకు పన్నులు తగ్గిస్తూ, సామాన్యులపై పన్నులు పెంచుతూ ధనిక, పేదల మధ్య అంతరాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సృష్టిస్తోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాలు దేశాన్ని మాంద్యం దిశగా తీసుకెళ్తున్నాయని, పాలకులు మేలుకోవాలని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు, పెరుగు వంటి వినియోగాలపై పన్నులు వేయడం తగదన్నారు. అదానీ, అంబానీ వంటి బిలియనీర్ల సంపదపై పన్ను పెంచాలని డిమాండ్ చేశారు. డొల్ల కంపెనీల బండారాన్ని హిడెన్‌బర్గ్ బయటపెట్టడంతో కార్పొరేట్ల బండారం మరోసారి బహిర్గతమైందని తెలిపారు. డొల్ల కంపెనీల కారణంగా ఎల్‌ఐసి, ఎస్‌బిఐ షేర్లు నష్టపోయాయని చెప్పారు. డొల్ల కంపెనీల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సెబీ, ఇతర సంస్థల సహాయంతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన విధంగా విశాఖపట్నం వెళ్లడానికి ఎవరికి ఇబ్బంది లేదని, రాజధాని మారుస్తామనడం మీసొంత జాగీరు కాదని, సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర పేరుతో చిచ్చు రాజేయడం తగదని, చివరికి బూమరాంగ్ అవుతుందని హెచ్చరించారు. రాబోయే మూడు నెలల కాలానికి సంబంధించిన ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఐఎన్ సుబ్బమ్మ, ఎ.రామమోహన్, బి.మనోహర్ పాల్గొన్నారు.