Sep 29,2022 20:49

ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : బిజెపి పాలనలో దేశం అధోగతిపాలవుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రతినిధులు అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది పరిశ్రమలు మూతపడి, కోట్లాది మంది నిరుద్యోగులుగా మారడానికి ఆ పార్టీ చేస్తున్న కుట్రలే ప్రధాన కారణమని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 595వ రోజుకు చేరాయి. గురువారం నాటి దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎంఎం, ఎస్‌బిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి స్టీల్‌ ఎఐటియుసి అధ్యక్షులు బోసుబాబు మాట్లాడుతూ.. బిజెపి విధానాలపై పోరాటం ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 75 సంవత్సరాలుగా దేశ ప్రజలు సృష్టించిన సంపదను ఇద్దరు వ్యాపారులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలూ కేంద్ర ప్రభుత్వ విధానాలను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు తదితర జాతీయ సంపదను నరేంద్ర మోడీ తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఆపకపోతే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అదాని, అంబానీల వశమవుతాయని అన్నారు. అక్టోబర్‌ 2న జరిగే ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రలో పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. దీక్షలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, వై.మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావు, యు.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.