Aug 05,2022 20:25

ప్రజాశక్తి- ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ప్రజాశక్తి సాహితీ సంస్థ సౌజన్యంతో నెల్లూరిలోని డాక్టర్‌ రామచంద్రరెడ్డి ప్రజా వైద్యశాలకు చెందిన రెండు వైద్య బృందాల ఆధ్వర్యాన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని మూడు గ్రామాల్లో శుక్రవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. తొలుత ఎర్రగట్టులో వైద్యశిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత నందిగామ, మురుమూరులో వైద్య శిబిరాలు నిర్వహించారు. జ్వరం, కాళ్లు, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలతో బాధపడుతున్న వారికి వైద్యులు వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ మూడు గ్రామాల్లో 260 మంది వైద్యసేవలు పొందారు. పరీక్షల అనంతరం డాక్టర్లు రమేష్‌, సుమన్‌ మాట్లాడుతూ వరదలతో నీరు కలుషితమై అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహారం తీసుకోవాలని, మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలు వాడాలని సూచించారు. మంతెన సీతారాం మాట్లాడుతూ వరదల ప్రభావంతో ఏజెన్సీలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయన్నారు. చింతూరు ఐటిడిఎ పరిధిలో ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ఈ నాలుగు మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఎటపాక వైఎస్‌ ఎంపిపి పెనుబల్లి కుమారి, సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బప్పన కిరణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, నెల్లూరు ప్రజా వైద్యశాల సిబ్బంది పాల్గన్నారు.
ఉపయోగకరంగా ఉంది :అరవా కామేశ్వరరావు, నందిగామ గ్రామస్తులు
వరదల్లో గ్రామం మొత్తం మునిగి బురదతో, దోమలతో సహజీవనం చేస్తున్నాం. ఇటువంటి ఆపత్కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతోగానే ఉపయోగకరంగా ఉంది. ప్రజాశక్తికి, నెల్లూరు వైద్య బృందానికి, సిపిఎంకు అభినందనలు.


ప్రభుత్వ వైద్యులు రాలేదు :ఆకుల నారాయణలక్ష్మి, మురుమూరు గ్రామస్తులు
వరదలు వచ్చి గ్రామం మొత్తం ముంపునకు గురై ప్రజలంతా అనారోగ్యం పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ వైద్య అధికారులు ఎవరూ ఇంతవరకు పట్టించుకోలేదు. మొదటిసారి సిపిఎం ఆధ్వర్యాన వైద్య బృందం మా గ్రామానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం హర్షణీయం.