Aug 05,2022 09:59
  • పిఎంఎఫ్‌బివైతో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభాల పంట
  • ప్రభుత్వ సంస్థల కంటే రెట్టింపు ఆదాయం
  • ఐదేళ్లలో రూ. 24,350 కోట్లు గడించిన తీరు
  • నష్టపోతున్న రైతులు.. లాభాల్లో సంస్థలు : ఎఐకెఎస్‌ ఆగ్రహం

భోపాల్‌ : దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే విఫలమైంది. రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రయివేటు సంస్థలకు లబ్ది చేకూర్చే విధంగా పనిచేస్తున్నది. ఇందుకు పంటల బీమా పథకం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) అమలు తీరే నిదర్శనం. పిఎంఎఫ్‌బివై కింద గత ఐదేళ్లలో ప్రయివేటు సంస్థలు అధికంగా లాభపడ్డాయి. 2016-17 నుంచి 2020-21 మధ్య కాలంలో ప్రభుత్వ బీమా సంస్థలతో పోలిస్తే రెట్టింపు లాభాలను గడించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలిపిన గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి.
       ఈ సమాచారం ప్రకారం.. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద ఎంప్యానెల్‌ చేయబడిన 13 ప్రయివేటు బీమా కంపెనీలలో పది సంస్థలు రూ. 24,350 కోట్లను ఆర్జించాయి. ఐదు ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం రూ. 3,344 కోట్ల నష్టాన్ని చవి చూడటం గమనార్హం. 2018-19, 2019-20 లో మొత్తం ఐదు ప్రభుత్వ సంస్థలు ఈ పథకం కింద రూ. 2,506 కోట్ల నష్టాలను చూశాయి. ఇదే సమయంలో ప్రయివేటు కంపెనీలు రూ. 9,278 కోట్ల లాభాలను ఆర్జించటం గమనార్హం.
 

                                                                           పిఎంఎఫ్‌బివై అంటే..?

పిఎంఎఫ్‌బివై అనేది పంటల బీమా పథకం. ఇది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల ఫలితంగా ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు.. రైతులకు బీమా కవరేజీని, ఆర్థిక సహాయాన్ని అందించటం ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. ఈ పథకం అమలు కోసం 13 ప్రయివేటు సంస్థలతో సహా 18 సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం చేర్చుకున్నది. ఈ పథకం కింద రైతులు ఖరీఫ్‌ పంటలకు ప్రీమియంలో 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం బీమా మొత్తంలో తమ వాటాగా చెల్లిస్తారు. పంటల బీమా ప్రీమియంకు భారీగా రాయితీ ఇస్తారు. ఖర్చులను రాష్ట్రం, కేంద్రం భరిస్తాయి.
       2016-17 నుంచి 2020-21 మధ్య ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు రెండూ స్థూల ప్రీమియం (రైతులు, రాష్ట్రాలు, కేంద్రం) మొత్తం రూ. 1,38,312 కోట్లు పొందాయి. ఇందులో రైతుల వాటా 15.5శాతం, రాష్ట్రాల వాటా 43.4శాతం, కేంద్రం వాటా 41.1శాతంగా ఉన్నాయి.
నిర్దిష్టంగా చెప్పాలంటే.. ప్రయివేటు బీమా కంపెనీలు స్థూల ప్రీమియంగా రూ.69,697 కోట్లు పొందాయి. రూ. 45,317ను క్లెయిమ్‌లుగా చెల్లించాయి. దీంతో ఆ కంపెనీలు రూ. 24,350 కోట్ల ప్రత్యక్ష లాభాన్ని పొందాయి.
      ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు ప్రీమియంగా రూ. 68,645 కోట్లను పొందాయి. ఐదేళ్లలో రూ.56,728 కోట్లను క్లెయిమ్‌లుగా చెల్లించాయి. దీంతో రూ.11,917 కోట్లను అదనంగా గడించాయి. ఇది ప్రయివేటు కంపెనీలు పొందిన లాభాలతో పోల్చుకుంటే సగం కావటం గమనార్హం.
     ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు దాదాపు ఒకే విధమైన ప్రీమియంలను పొందాయి. దేశవ్యాప్తంగా 2.47 కోట్ల మంది రుణగ్రహీత రైతుల ప్రీమియంలను స్వీకరించాయి. ఐదు ప్రభుత్వ బీమా సంస్థలలో అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా (ఎఐసి) మాత్రమే అత్యధికంగా రూ. 14,933 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
 

                                                               అనిల్‌ 'రిలయన్స్‌'కు 4700 కోట్ల లాభం..!

మరోవైపు, అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పంటల బీమా పాలసీ ద్వారా అత్యధికంగా రూ. 4,731 కోట్ల లాభాన్ని గడించింది. తర్వాతి స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో (రూ.4,060 కోట్లు), ఇఫ్కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రూ. 3,704 కోట్ల లాభాలను ఆర్జించాయి.
 

                                                       ప్రయివేటుకు కట్టబెట్టటం దుర్మార్గం : హన్నన్‌మొల్లా

పిఎంఎఫ్‌బివై కింద ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఉంచటం దుర్మార్గమైన చర్య అని ఆలిండియా కిసాన్‌ సభ జనరల్‌ సెక్రెటరీ హన్నన్‌ మొల్లా అన్నారు. ''రైతులు నష్టపోతుంటే.. బీమా కంపెనీలు వారి పంటల ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయి. ఈ పథకాన్ని రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టారు కానీ ప్రయివేటు బీమా సంస్థల కోసం కాదు. రైతు ఆందోళన సమయంలోనే ఈ విషయాన్ని మేం ప్రధానంగా లేవనెత్తాం'' అని చెప్పారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను మాత్రమే ఈ పథకం కింద ఎంప్యానెల్‌ చేయాలన్నారు. పిఎంఎఫ్‌బీవై కింద రైతుల కంటే బీమా కంపెనీలే భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమని మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు నాయకుడు శివకుమార్‌ కక్కా తెలిపారు. మధ్యప్రదేశ్‌లో రూ. లక్ష విలువైన పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి మాత్రమే అందజేశారన్నారు.
 

                                                                               రాష్ట్రాల్లో ఇలా..!

కొన్ని రాష్ట్రాల్లో రైతులు చెల్లించిన ప్రీమియంకు, కంపెనీలు చెల్లించిన క్లెయిమ్‌లకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. మహారాష్ట్రలో ఐదేండ్లలో 6.40 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ. 27,719 కోట్ల ప్రీమియం బీమా సంస్థలకు అందగా.. అవి చెల్లించిన క్లెయిమ్‌లు రూ. 19,619 కోట్లుగా ఉన్నది. అంటే, బీమా సంస్థలు పొందిన లాభం రూ. 8,070 కోట్లుగా ఉన్నది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో గుజరాత్‌ (రూ. 6,813 కోట్లు), యూపీ (రూ. 3,902 కోట్లు) ఉన్నాయి. ఈ వ్యత్యాసం తెలంగాణలో రూ. 1,116 కోట్లుగా, ఏపీలో 160 కోట్లుగా ఉన్నది.