Jan 24,2023 11:27

క్యూబా సంఘీభావ కమిటీ జాతీయ నాయకులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కింద నిలిగిపోతున్న క్యూబా ప్రజలు సోషలిజం స్ఫూర్తితో మొక్కవోని ధైర్యంగా ముందుకు వెళుతున్నారని తెలిపారు . అక్కడి ప్రజలు ఆరోగ్యంగా బతుకుతున్నారని, ఉచిత విద్య అందిస్తోందని చెప్పారు. కష్టానికి ప్రతిఫలం అందించే దేశంగా నేడు ప్రపంచంలో నిలిచిందని, కరోనా సమయంలోనూ వేలమంది వైద్యులను ప్రపంచదేశాలకు పంపించిందని చెప్పారు, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రజలు ఏమి కావాలో తెలుసుకునేందుకు 1.13 కోట్ల మంది ఉన్న దేశంలో 83 లక్షలమంది ప్రజల అభిప్రాయం తీసుకున్నారని, అంతకంటే ప్రజాస్వామ్యం ఏముటుందని ప్రశ్నించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారతదేశంలో ఒక్క చట్టం కూడా ప్రజలను అడిగి చేయలేదని, వద్దంటున్నా నూతన ఆర్థిక విధానాలు, నూతన విద్యావిధానం, కార్మికచట్టాలు, రైతాంగా వ్యతిరేక చట్టాలు చేశారని పేర్కొన్నారు.
 

                                                           పోరాటంలో ప్రపంచానికి స్ఫూర్తి క్యూబా

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 1991లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయిందని, ఆ సమయంలో క్యూబా అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో మాట్లాడుతూ చావనైనా చస్తాంగానీ, సోషలిజాన్ని వదులుకోమని శపథం చేశారని, ఇప్పటికీ ఆ దేశ ప్రజలు స్ఫూర్తి దాయకంగా నిలబడ్డారని వివరించారు. క్యూబా విప్లవ పోరాటం తరువాత చేగువేరా తొలిసారి ఇండియాను సందర్శించారని తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఆయనకు స్వాగతం పలికారన్నారు. క్యాస్ట్రోతో కలిసి చేపట్టిన అలీనోద్యమం ప్రపంచంలోనే భారతదేశం ఒక శక్తిగా రూపొందించేందుకు ఉపయోగపడిందని తెలిపారు. . విశాఖ ఉక్కును సోవియట్‌ సాయంతో నిర్మించారని తెలిపారు. అయితే సామ్రాజ్యవాద తొత్తులుగా మారిన నేటి ప్రభుత్వాలు వాటిని అమ్ముతున్నాయని తెలిపారు. సోషలిజం సాయంతోనే మనదేశం ఆర్థికంగా నిలడిందని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోనూ క్యూబాపై ఆంక్షలు విధించే సమయంలో ప్రపంచదేశాల నుండి వ్యతిరేకత వచ్చినా అమెరికా సిగ్గులేకుండా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. అయిల్‌ దిగుమతి విషయంలో అమెరికా ఆంక్షలు పెడుతోందని వివరించారు. చైనా స్వేచ్ఛగా సరుకులు ఎగుమతి చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో సంఘీభావం తెలపడం ద్వారా సోషలిస్టు వ్యవస్థలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కోరారు.
 

                                              ప్రపంచ మానవులు సుఖంగా ఉండాలని కోరుకున్నారు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చేగువేరా అమరజీవి అయ్యారన్నారు. ప్రపంచ మానవుడు సుఖంగా ఉండాలని కోరుకున్నారని, అందువల్లే ఆయనను ప్రపంచ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. ఆరు దశాబ్దాలుగా ఒక్క అడుగూ వెనక్కు వేయకుండా ధైర్యంగా నిలబడి క్యూబా ప్రజలు పోరాడుతున్నారని వివరించారు. క్యాస్ట్రోను చంపాలని వందలసార్లు ప్రయత్నించిందని, అయినా ధైర్యంగా అమెరికాను ఎదిరించిన దేశంగా నిలిచిందని తెలిపారు.
 

                                                                  క్యూబాలో నిజమైన స్వతంత్రం

వైసిపి నాయకులు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ అర్థరాత్రి మహిళా స్వేఛ్చగా తిరగ గిలిగితేనే నిజమైన స్వాతంత్య్రం అన్నారని, అది క్యూబాలో అమలు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికీ పాశ్చాత్యదేశాల అనైతిక విధానాలను అక్కడకు రానీయరని పేర్కొన్నారు.
 

                                                                   విప్లవానికి ప్రతీక చేగువేరా

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ విప్లవ పోరాటం అనంతరం చేగువేరా అన్ని పదువులనూ త్యజించి కాంగో పోరాటంలో పాల్గొన్నారని, బొలీవియాలో సిఐఏ ప్రతినిధులు హత్య చేశారని తెలిపారు. వారి తనయ అలైదా గువేరా విప్లవానికి చిహ్నంగా నిలిచారని తెలిపారు.
 

                                                               ఆయన జీవితం స్ఫూర్తిదాయకం

పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ విప్లవ పోరాటంలో వైవిధ్య భరితమైన చేగువేరా జీవితం ఎంతో స్ఫూర్తి దాయకమన్నారు. పోరాట నాయకుడిగా, వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఈ శతాబ్దంలోనే బలమైన ముద్రవేశారని ఆయన స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
 

                                                                       అంతర్జాతీయ పోరాట చిహ్నం

సభకు అధ్యక్షత వహించిన క్యూబా సంఘీభావ సభ కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అమెరికాను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది క్యూబా అన్నారు. అంతర్జాతీయంగా పోరాటాల చిహ్నం చేగువేరా అన్నారు. న్యూడెమెక్రసీ నాయకులు ప్రసాదు మాట్లాడుతూ విప్లవ పోరాటం అనంతరం క్యూబాలో సోషలిజం నిర్మాణానికి కాస్ట్రో పనిచేస్తే ప్రపంచ సోషలిజం కోసం చేగువేరా వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ క్యూబా ప్రజలకు ప్రపంచదేశాల నుండి పెద్దఎత్తున సంఘీభావం వస్తోందని తెలిపారు. ప్రపంచీకరణ ప్రారంభమైన తరువాత ఇప్పుడు ఎక్కువమంది సోషలిజం వైపు చూస్తున్నారని తెలిపారు. సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మూర్తి, న్యూడెమెక్రసీ నాయకులు రామకృష్ణ, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు, సిపిఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎస్‌యుసిఐసి నాయకులు అమర్‌నాథ్‌, ఎంసిపిఐ నాయకులు ఖాదర్‌భాషా, సుందరరామరాజు మాట్లాడుతూ చేగువేరా చనిపోయి 50 సంవత్సరాలు దాటిపోతున్నా ఆయన పోరాట స్పూర్తి ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. రమాదేవి, వనజ, దుర్గాభవానీ మాట్లాడారు. క్యూబా సంఘీభావ సభ నిర్వహణ కమిటీ నాయకులు వై.వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సభలో నాగార్జునా యూనివర్శిటీ ఆచార్యులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.