Mar 18,2023 15:28

న్యూఢిల్లీ : మళ్లీ కోవిడ్‌ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. గత నాలుగు నెలలకంటే ఇప్పుడే అత్యధికంగా నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా దేశంలో 841 కోవిడ్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉన్నాయని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,389కి చేరిందని ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల సంఖ్యతో వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.46 కోట్ల మందికి వైరస్‌ సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనాతో కేరళలో ఇద్దరు, జార్ఖండ్‌లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు మృతి చెందినట్లు ఆర్యోమంత్రిత్వశాఖ వెల్లడించింది.
కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో సగటున రోజువారీ 112 కోవిడ్‌ కేసులు నమోదవ్వగా.. మార్చి నెలలో సగటున 626 కేసులు నమోదవుతున్నాయి. ఒక్క మార్చి నెలలోనే కోవిడ్‌ కేసుల సంఖ్య సుమారు ఆరు రెట్లు పెరిగింది. అయితే కోవిడ్‌ రికవరీ రేటు 98 శాతం, మరణాల రేటు శాతం 1.19 శాతంగా నమోదవుతుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ సూచిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.64 కోట్ల డోసులను వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రభుత్వం అందించినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదువుతున్న రాష్ట్రాలకు బుధవారం కేంద్రం లేఖ రాసింది. కరోనా కేసుల్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆ లేఖలో రాష్ట్రాల్ని కోరింది.