
- ఏడాదేడాదీ తగ్గింపు
- విస్తీర్ణం, ఉత్పత్తి ఒకేలా ఉన్నా కొనుగోలులో కోతలు
- ప్రతి గింజకూ 'మద్దతు' ఉత్తిదే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రభుత్వ వరి ధాన్యం సేకరణ ఏడాదేడాది కోతలకు గురవుతోంది. గడచిన మూడు ఖరీఫ్ సీజన్లలో సేకరణ నేల చూపులే చూసింది. ఈ కాలంలో వరి సాగు విస్తీర్ణం ఇబ్బడిముబ్బడిగా తగ్గిందేమీ లేదు. ధాన్యం ఉత్పత్తిలో సైతం పెను మార్పులేమీ చోటు చేసుకోలేదు. అయినప్పటికీ ధాన్యం సేకరణ కత్తిరింపులను చవిచూసింది. సేకరణ అంతకంతకూ తగ్గడంతో రైతులకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర (ఎంఎస్పి) చాలా మట్టుకు దక్కట్లేదు. ఒక వైపు రైతు పండించిన ప్రతి గింజకూ ఎంఎస్పి ఇప్పించి తీరతామనగా, ఈ సమయంలోనే ప్రభుత్వ సేకరణ క్రమేపి దిగజారింది. వైసిపి అధికారంలోకొచ్చిన తొలేడాది ఖరీఫ్ కంటే మరుసటి సంవత్సరం ఖరీఫ్‌లో దాదాపు 50 వేల టన్నులు తగ్గగా, మూడవ ఏట నిరుడు ఏకంగా ఏడు లక్షల టన్నుల సేకరణ తగ్గింది. ఈ మారు ఖరీఫ్‌లో అదే ఒరవడి కనిపిస్తోంది. అందులో భాగంగా ధాన్యం సేకరణ లక్ష్యాన్ని సర్కారు పరిమితం చేసింది. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాల మేరకే టార్గెట్‌ను పరిమితం చేసినట్లు సమర్ధించుకుంటోంది.
కాకి లెక్కలు
2019-20 ఖరీఫ్‌లో 38.15 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. వ్యవసాయశాఖ 80.13 లక్షల టన్నుల ధాన్యం లభిస్తుందని అంచనా వేసింది. అంతే ఉత్పత్తి వచ్చింది. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా 47.83 లక్షల టన్నులు సేకరించింది. 2020-21 ఖరీఫ్‌లో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా తొలుత 85.16 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని భావించారు. చివరాఖరికి 67.60 లక్షల టన్నులే లభించిందని సామాజిక సర్వే, అర్థ గణాంకశాఖ లెక్కలు వెల్లడించాయి. నవ్యాంధ్ర ఏర్పడ్డాక ఇదే తక్కువ ఉత్పత్తి. వర్షాలు, వరదల వలన దిగుబడి తగ్గింది. అయినప్పటికీ ఆ సంవత్సరం పౌర సరఫరాల శాఖ 47.32 లక్షల టన్నులు సేకరించింది. నిరుడు 2021-22 ఖరీఫ్‌లో 40.77 లక్షల ఎకరాల్లో వరి వేశారు. తొలుత 83.56 లక్షల టన్నులొస్తాయనుకున్నారు.
కోవిడ్‌లో బానే ఉంది
మొదటి దశ కోవిడ్ సమయానికి 2019 ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తయింది. ఆ ప్రభావం రబీపై పడింది. రెండవ దశ కోవిడ్ విజృంభణ వెనకపట్టు పట్టాక 2020 ఖరీఫ్ ధాన్యం సేకరణ జరిగింది. కోవిడ్ ప్రభావం ఉన్నా సేకరణ పర్లేదనిపించింది. 2021లో మూడవ దశ ఒమిక్రాన్ అన్నప్పటికీ పెద్దగా ఇబ్బందేమీ రాలేదు. అయినప్పటికీ నిరుడు సేకరణ బాగా పడిపోయింది. ఈ ఏడాది కోవిడ్ లేకపోయినా సేకరణ లక్ష్యం తగ్గించారు. కేంద్ర షరతులు, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వలన నిరుడు ధాన్యం సేకరణ తగ్గింది. మూడు వారాల్లో ధాన్యం ఇచ్చిన రైతులకు సొమ్ము చెల్లించాల్సి ఉండగా నెలల పర్యంతం చెల్లించలేదు. ఇ-క్రాప్, రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తు రిజిస్ట్రేషన్, కూపన్లు, గోనె సంచుల కొరత, తేమశాతం వంటి కఠిన నిబంధనల వలన రైతులు వ్యాపారులకు, మధ్య దళారులకు పంటను తెగనమ్ముకుంటు న్నారు. కౌలు రైతుల వెతలు మరీ దారుణం. ప్రణాళికాశాఖ నాల్గవ ముందస్తు అంచనాలకొచ్చేసరికి ధాన్యం ఉత్పత్తి 70.96 లక్షల టన్నులని నిర్ధారించారు. కాగా నిరుడు పౌరసరఫరాల శాఖ 40.31 లక్షల టన్నులనే సేకరించింది. అంతకుముందు ఏడాది కంటే ఏడు లక్షల టన్నులకు కోత పడింది. ప్రస్తుత ఖరీఫ్ 2022-23లో 35.25 లక్షల ఎకరల్లోనే వరి సాగవుతుందని, 67.89 లక్షల టన్నులొస్తాయని అంచనా వేసి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 37 లక్షల టన్నులకు పరిమితం చేశారు. అసలే గతేడాది సేకరణ తగ్గగా, అంతకంటే ఈ తడవ టార్గెట్‌ను కుదించారు.
టార్గెటే తగ్గిన నేపథ్యంలో చివరాఖరికి సేకరణ ఇంకెంత తగ్గుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కాగా సాగును కావాలని తగ్గించారని, 37 లక్షల ఎకరాల వరకు ఉందని చెబుతున్నారు.
