Aug 04,2022 21:52

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్‌ శోభానాయుడు తన జీవిత అనుభవాల ఆధారంగా రచించిన 'నాట్యం నా జీవితం' (డాన్స్‌ ఈజ్‌ మై లైఫ్‌) పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ విభాగాధిపతి ఆచార్య ఎ.అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విలువలకు కట్టుబడిన కళాకారిణి శోభా నాయుడు అని కొనియాడారు. రేడియోలో వచ్చే సంగీత కార్యక్రమాలను విని అతి పిన్న వయస్సులోనే కూచిపూడి నృత్యంపై అవగాహన పెంచుకున్నారని తెలిపారు. దేశ విదేశాల్లో కళారూపాలు ప్రదర్శించి ఎంతో పేరు తెచ్చుకున్నారన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. శోభానాయుడు, విశాఖలో 257 మంది కళాకారులకు ప్రభుత్వంతో మాట్లాడి ఇళ్లు ఇప్పించారని తెలిపారు. హైదరాబాద్‌లో డ్యాన్స్‌ అకాడమీ ఏర్పాటు చేసి కళాకారులను తయారు చేశారన్నారు. సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ అ వైపునకు వెళ్లకుండా విలువలకు కట్టుబడ్డారని కొనియాడారు. ఆమె బయోగ్రఫీని భవిష్యత్‌ తరాలకు అందించేందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. విశాఖ ప్రముఖులు బాదంగీర్‌ సాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి నరసింహారాజు, జ్యోతిశర్మ, సుప్రదం సినిమా నిర్మాత పిఎన్‌.తిలక్‌, జ్యోతీశ్వరరావు పాల్గొన్నారు.