May 26,2023 08:11

ప్రతి సంక్షోభమూ ప్రతి చోటా గతంలో కార్మికవర్గ సంపాదించుకున్న హక్కులు, సామాజిక రక్షణలనూ హరిస్తున్నది. తప్పనిసరై కరోనా కాలంలో ఇచ్చిన మెడికల్‌ బీమా రాయితీలను సమీక్షించాలని రాష్ట్రాలను బైడెన్‌ ఆదేశించాడు. వాటిని గనుక రద్దు చేస్తే 53 నుంచి 142 లక్షల మంది వరకు వీధిన పడతారు. అందువలన ఇది ఒక్క అమెరికా సమస్యే కాదు. పెద్దన్న అడుగు జాడల్లో నడిచే ప్రతి చోటా అప్పుల అనకొండలు కార్మికవర్గం మీద దాడులకు దిగుతాయి.

జూన్‌ ఒకటవ తేదీ దగ్గర పడే కొద్దీ...తమ మీద ఎక్కడ పిడుగు పడుతుందో, ఎలా పడుతుందోనని ... అమెరికా కార్మికవర్గం, మధ్య తరగతిలో గుబులు పెరుగుతోంది. ఉరుము ఉరిమి ఓటి మంగలం మీద పడినట్లు దేశ రుణ పరిమితి గురించి అధికార డెమోక్రటిక్‌, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య వాద ప్రతివాదనల లాలూచీ తతంగం తమ మీద భారం ఎంత మోపుతుందనేదే వారి ఆందోళన. ప్రభుత్వ రుణ పరిమితి పెంపుదలపై ప్రజా ప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్న రిపబ్లికన్లు అంగీకరించకపోతే జనం మీద భారం పడుతుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అంతా మీరే చేశారు, దీనంతటికీ మీరే కారణం అని డెమోక్రాట్ల మీద రాజకీయ దాడి చేసేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ పెంపుదలకు నిరాకరిస్తుందా లేక చివరి వరకు మొరాయించి ఓట్ల కోసం అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. రుణ పరిమితి ఎంత పెరిగితే అంతగా జనం మీద భారాలు పెరగటం లేదా ఉన్న సౌకర్యాలకు కోత పడుతుంది.
         ప్రపంచంలో అనేక దేశాలు రుణ ఊబిలో కూరుకు పోతున్నాయి. గత పాతిక సంవత్సరాల్లో ప్రత్యేేకించి గడచిన పదేళ్లలో, కరోనాతో, కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఆదాయం తక్కువగా ఉండే దేశాల రుణాలు పెరిగాయి. డెబ్బయి మూడు దేశాలు అధిక రుణ భారంతో ఉండగా వాటికి ఉపశమనం కలిగించేందుకు జి-20 కూటమి చొరవ తీసుకొన్నది. వడ్డీ, అసలు చెల్లింపులను వాయిదా వేయించేందుకు అప్పులిచ్చిన వారితో చర్చలకు 2020-21 లోనే తెరతీసింది. నలభై ఒక్క దేశాలు ఇవాళా రేపా అన్నట్లుగా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మన ఇరుగు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్తాన్‌ పరిస్థితి తెలిసిందే. ఐఎంఎఫ్‌ గుమ్మం తొక్కితే అప్పు తీర్చే శక్తిని సమకూర్చుకొనే పేరుతో అది విధిస్తున్న షరతులతో జనం మీద మరిన్ని భారాలు మోపాల్సి ఉంటుంది. అమెరికాలోనూ జరిగేది అదే.
పేద దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏకైక ధనిక దేశమైన అమెరికాకు సత్తా ఉండి కూడా ఎందుకు రుణాలు చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. కార్పొరేట్లకు దేశ సంపదలను కట్టబెట్టటంతో పాటు ప్రపంచం మీద ఎదురులేని పెత్తనం కోసం మిలిటరీ బడ్జెట్‌ను విపరీతంగా పెంచటం, మార్కెట్లు, వనరులను ఆక్రమించుకొనేందుకు చేస్తున్న దురాక్రమణలు, యుద్ధాలకు వెచ్చిస్తున్న ఖర్చు వంటి ప్రజా వ్యతిరేక పనులే ప్రధాన కారణం అని గమనించాలి. ప్రపంచ రుణ భారం 2023 తొలి మూడు నెలల్లో పెరిగిన 8.3 లక్షల కోట్ల డాలర్లతో మొత్తం 305 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీనిలో అమెరికా ప్రభుత్వ అప్పు 31.4 లక్షల కోట్ల డాలర్లు. ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్లలో గత రెండు దశాబ్దాల్లో అది నాలుగు నుంచి ఆరు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కీలుబొమ్మ ఉక్రెయిన్‌కు 375 బిలియన్‌ డాలర్ల మేర సాయం అందించనున్నట్లు హిరోషిమా జి7 సమావేశాలలో జోబైడెన్‌ ప్రకటించాడు. ఇది గత సంవత్సరం ఇచ్చిన 113 బి.డాలర్లకు అదనం. కార్పొరేట్లకు జార్జి డబ్ల్యు బుష్‌ రెండు సార్లు తాత్కాలికంగా పన్నులు తగ్గించాడు. తరువాత అధికారానికి వచ్చిన ఒబామా వాటిని శాశ్వతం చేయటంతో పదేళ్లలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర ఖజానాకు గండిపడి ఆ మేరకు రుణం పెరిగింది. ఇదిగాక డోనాల్డ్‌ ట్రంప్‌ పన్ను రేటును అధికారికంగా తగ్గించి రెండు లక్షల కోట్ల డాలర్లను కట్టబెట్టాడు. ట్రంప్‌ బూట్లలో కాళ్లు దూర్చిన జో బైడెన్‌ అదే నడక సాగిస్తున్నాడు. దీంతో ఇంతింతై వటుడింతై అన్నట్లు అనకొండలా అప్పు పెరుగుతోంది. గత సంవత్సరం 55 కార్పొరేషన్లు అసలు పన్ను చెల్లించలేదని, అధికారికంగా 21 శాతం పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ సగటున చెల్లిస్తున్నది ఎనిమిది శాతానికి మించి లేదని హిరోషిమాలో బైడెన్‌ గర్వంగా చెప్పుకున్నాడు.
           ఇలాంటి మినహాయింపులు ఇవ్వటానికి కార్పొరేట్లు దివాలా తీశాయా అంటే అదేమీ లేదు. 2014-2020 కాలంలో ఏటా 20 శాతం చొప్పున లాభాలు పెంచుకోగా వాటి నుంచి ఖజానాకు రావాల్సిన మొత్తాలు 60 శాతం తగ్గాయి. ఓఇసిడి దేశాల జిడిపిలో కార్పొరేట్‌ పన్ను భాగం సగటున మూడు శాతం కాగా అదే అమెరికాలో 1.1 శాతమే ఉంది. దాని తరువాత చివరన ఒక శాతంతో లాత్వియా ఉంది. ఇక పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతి పదేళ్లకు ఒకసారి వస్తున్న సంక్షోభాలలో దివాలా తీస్తున్న కార్పొరేట్‌ కంపెనీలను అదుకొనేందుకూ అప్పులే మార్గం. అది వారికి వరం జనానికి శాపం. 2008లో ఒబామా రెండు లక్షల కోట్ల డాలర్లను కార్పొరేట్లకు సమర్పించుకున్నాడు. ప్రతి సంక్షోభమూ ప్రతి చోటా గతంలో కార్మికవర్గ సంపాదించుకున్న హక్కులు, సామాజిక రక్షణలనూ హరిస్తున్నది. తప్పనిసరై కరోనా కాలంలో ఇచ్చిన మెడికల్‌ బీమా రాయితీలను సమీక్షించాలని రాష్ట్రాలను బైడెన్‌ ఆదేశించాడు. వాటిని గనుక రద్దు చేస్తే 53 నుంచి 142 లక్షల మంది వరకు వీధిన పడతారు. అందువలన ఇది ఒక్క అమెరికా సమస్యే కాదు. పెద్దన్న అడుగు జాడల్లో నడిచే ప్రతి చోటా అప్పుల అనకొండలు కార్మికవర్గం మీద దాడులకు దిగుతాయి.
 

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌