Sep 29,2022 21:44

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :  అల్లూరి స్ఫూర్తితో బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు కంకణ బద్దులు కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద దేశ రక్షణ భేరి సభ సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌ అధ్యక్షత జరిగింది. ఈ సభలో ఉమామహేశ్వరరావు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీ ఎన్నికల ముందు అధిక ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం, విదేశాల్లో నల్లధనం తెస్తామంటూ హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఆ హామీలకు భిన్నంగా ఎనిమిదేళ్ల పాలనలో ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టారన్నారు. పెట్రో ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలన్నీ కొండెక్కాయన్నారు. చిన్నపిల్లలు తాగే పాలతో మొదలై శ్మశానంలో అంత్యక్రియల వరకూ జిఎస్‌టి భారాన్ని మోపారని తెలిపారు. రాష్ట్ర ప్రజల పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో, అదానీ కంపెనీలకు అప్పన్నంగా కట్టబెట్టేందుకు చూస్తున్నారన్నారు. ఎల్‌ఐసి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను తుంగలో తొక్కిన బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు వంతపలకడం శోచనీయమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 

cpm