Aug 19,2022 07:21

శ్రీనగర్‌ : ఉగ్రవాదులకు చేరవేసే ఉద్దేశ్యంతో డ్రోన్‌ నుంచి జారవిడిచిన ఆయుధ సామగ్రిని జమ్ము సమీపంలోని పల్లియన్‌ మండల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వద్ద భద్రతాబలగాలు నాడు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికై అరెస్టు అయి జైలులో ఉంటున్న ఒక ఉగ్రవాది ఈ సమాచారం అదించగా..అదే ప్రదేశం వద్ద నాటకీయ పరిణామాల్లో సదరు ఉగ్రవాది హతమయ్యాడు. బుధవారం జరిగిన ఈ ఘటన గురించి ఎడిజిపి ముఖేశ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్‌ అలీ హుస్సేన్‌ అలియాస్‌ ఖాసీంను భద్రతా బలగాలు ఇదివరకే వేరొక కేసులో అరెస్టు చేశారు. అతడిని బుధవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసుల కస్టడీకి అప్పగించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా సరిహద్దు వెంబడి డ్రోన్లను వినియోగించి ఆయుధాలు ఎక్కడెక్కడ జారవిడిచింది..ఎక్కడెక్కడ డంప్‌ చేసింది అతడు వివరించాడు. దీంతో అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లగా ..డ్రోన్‌ ద్వారా జారవిడిచిన ఆయుధ సామగ్రితో కూడిన ప్యాకెట్‌ను బలగాలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో ఉగ్రవాది ఖాసీం తన పక్కనే ఉన్న పోలీసు రైఫిలును లాక్కొని పరాయ్యేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే స్పందించి కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆయుధాల చేరవేతకు వినియోగించిన డ్రోన్‌ను పాక్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు