
భీమవరం (పశ్చిమ గోదావరి) : ఎపి రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాని తక్షణమే కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ... శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వామపక్షాలు, వివిధ సంస్థలు, వ్యాపారులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ... భీమవరంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన జరుగుతుందన్నారు. ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనకు మద్దతుగా భీమవరంలో నిరసన చేపట్టామన్నారు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాని తక్షణమే కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన హామీలన్నిటినీ అమలు చేయాలని కోరారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దని, విశాఖకు రైల్వే జోన్‌ను సమగ్రంగా ప్రకటించి, దాన్ని విడదీయకుండా ఇవ్వాలని అడిగారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. రెవెన్యూ బడ్జెట్ లోటును రాష్ట్రానికిచ్చి జిఎస్టి రూపంలో రావాల్సిన నిధులన్నిటినీ ఆంధ్ర రాష్ట్రానికిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, నిర్వాసితుల పునరావాసానికి నిధులు, ఉక్కు ఫ్యాక్టరీకి నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనకు మద్దతుగా ప్రజలంతా ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.