Jun 22,2022 22:07

-ఆపరేషన్‌ కమల్‌లో అరాచకాలెన్నో..!
- కిడ్నాప్‌ చేసి..గుజరాత్‌కు తీసుకెళ్లారన్న ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌
- రాజీనామాకు సిద్ధమన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే
- పదవి కోసం వెంపర్లాడనని వెల్లడి
-శివసేన ఆదేశాలు చెల్లవన్న ఏక్‌నాథ్‌ షిండే ట్వీట్‌

న్యూఢిల్లీ/ముంబయి : మహారాష్ట్ర వేదికగా బిజెపి మరోమారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేందుకు తెగబడింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు భారీ స్థాయిలో కేంద్ర బలగాలను, గుజరాత్‌ పోలీసులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ద్వారా బిజెపి ఈ ఆపరేషన్‌ కమల్‌ను చేపట్టిన్నట్లు బుధవారం నాటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బిజెపి అధినాయకుల నుంచి పెద్ద ఎత్తున షిండేకి అండదండలు లభిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సూరత్‌ నుంచి ప్రత్యేక ఛార్డెడ్‌ విమానంలో అసోంలోని గౌహతీకి తరలివెళ్లారు. బుధవారం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు గౌహతీకి చేరుకోవటం సంక్షోభాన్ని మరింత పెంచింది. అయితే వీరంతా ఇష్టపూర్వకంగా తిరుగుబాటు శిబిరానికి వెళ్లలేదని, భారీ మొత్తంలో నజరానాలు, బెదిరింపులు..అవీ వీలుపడకపోతే అపహరణలు..వంటి అరాచక చర్యలతోనే తిరుగుబాటు శిబిరంలో సంఖ్యా బలం పెరిగినట్లు బుధవారం నాటి పరిణామాలు చాటి చెప్పాయి. శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో షిండే వైపు 33 మంది ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దామని ఏక్‌నాథ్‌ షిండే బుధవారం మరోమారు ప్రతిపాదించారు. తమదే అసలైన శివసేన అంటూ ఏక్‌నాథ్‌ షిండే, ఆయన వెనుకున్న 30 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ కోశ్యారీకి లేఖ రాయటం తీవ్ర కలకలం రేపింది. శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండేను గుర్తించాలని లేఖలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరారు. శివసేన తన సిద్ధాంతంతో రెండేండ్ల క్రితమే రాజీపడిపోయిందని ఆరోపించారు. తిరుగుబాటు శిబిరం నుంచి తప్పించుకువచ్చిన శివసేన ఎమ్మెల్యే ఒకరు చేసిన ప్రకటన మహారాష్ట్రలో బిజెపి పన్నాగాలకు అద్దం పట్టింది.
కర్నాటకలో చేసినట్టుగానే..
కర్నాటకలో కాంగ్రెస్‌, జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చినట్టుగానే..ఇక్కడా కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి రావడానికి బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బిజెపి చేపట్టిన 'ఆపరేషన్‌ కమల్‌' కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనను కిడ్నాప్‌ చేసి గుజరాత్‌కు బలవంతంగా తీసుకెళ్లారని శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆయన సూరత్‌ నుంచి ముంబయికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..''ఏక్‌నాథ్‌ షిండే నన్ను తప్పుదోవ పట్టించి సూరత్‌ తీసుకెళ్లారు. మహా సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామనే విషయం ముందు చెప్పలేదు. అక్కడకు వెళ్లాకే విషయం తెలిసింది. దాంతో నేను హోటల్‌ నుంచి బయటకు వచ్చాను. కానీ నన్ను పోలీసులు అడ్డుకుని, గుండెపోటు వచ్చిందని బలవంతంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నన్ను హత్య చేయడానికి కుట్రలు జరిగాయి. ఎలాగోలా తప్పించుకొని ముంబయికి చేరుకున్నా''అని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధం : ఉద్ధవ్‌ థాకరే
కోవిడ్‌తో బాధపడుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'సొంత ఎమ్మెల్యేలు తనను వద్దనుకుంటున్నారా?' అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయ సంక్షోభం మొదలయ్యాక మొదటిసారిగా ఉద్ధవ్‌ థాకరే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రసంగించారు. 'ముఖ్యమంత్రి నా బాధ్యతలను సక్రమంగానే నిర్వహిస్తున్నాను. కోవిడ్‌ సమయంలో ఎంతో కృషి చేశా. నేను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా..ముఖ్యమంత్రి పదవి వదులుకుంటా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది. బాల్‌ థాకరే కుమారుడిని. పదవి కోసం వెంపర్లాడను. నా తర్వాత కూడా శివసేన నేత సిఎం అయితే సంతోషిస్తా. శరద్‌ పవార్‌ కోరిన తర్వాత సిఎం పదవి చేపట్టా. సంకీర్ణ ప్రభుత్వంలో చేరాను. సిఎం పదవి కోసం పోరాటం చేయను. కొందరు ప్రేమతో గెలుస్తారు. ఇంకొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు పదవిలో కొనసాగాలని లేదు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటా' అని థాకరే భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
ఏం చెప్పగలను..
ఇదంతా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ పక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు నన్ను సీఎంగా వద్దనుకుంటే అది వేరు. ఈ రోజుకీ..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ నన్ను సీఎంగా ఉండాలని కోరారు. కానీ నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు నేనేం చెప్పగలను?..అని థాకరే ఆవేదన వ్యక్తం చేశారు.

శివసేన శాసనసభా నేత షిండే : రెబల్‌ ఎమ్మెల్యేలు లేఖ
ఏక్‌నాథ్‌ షిండే శివసేన శాసనసభా పక్ష నేతగా పేర్కొంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌, డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. ''ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేం తిరుగుబాటు చేస్తున్నాం. అయితే అసెంబ్లీలో శివసేన పార్టీ అంటే మాదే. అందుకే ఏక్‌నాథ్‌ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. పార్టీ చీఫ్‌ విప్‌గా సునిల్‌ ప్రభు స్థానంలో భరత్‌ గోగవాలేను నియమించుకున్నా''మని లేఖలో రెబల్స్‌ పేర్కొన్నారు.