Sep 29,2022 19:47

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బిజెపి ఒత్తిడికి లొంగి ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌పై కర్నూలులో అక్రమ కేసులు బనాయించడాన్ని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ ఖండించారు. ప్రజాతంత్ర వాదులంతా బిజెపి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను, కుట్రలను ఖండించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. కులాన్ని, మతాన్ని రెచ్చగొడుతున్నారంటూ చలసాని శ్రీనివాస్‌పై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదేపదే ద్రోహం చేస్తుందనే విషయాన్ని ఎత్తిచూపినందుకు అక్కసుతో ఆయనపై బిజెపి కేసులు మోపిందని విమర్శించారు. ఈ వైఖరి సరైందికాదని, చలసాని శ్రీనివాస్‌ ఏనాడూ ఒక మతాన్నిగానీ, కులాన్నిగానీ రెచ్చగొట్టిందిలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే వారిని అణచివేసేందుకు బ్లాక్‌మెయిలింగ్‌ కుట్రలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు వాస్తవాలు విచారించకుండా కేసులు పెట్టి, వేధించడం దుర్మార్గమని వివరించారు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులుగా, ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులుగా సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న చలసాని శ్రీనివాస్‌పై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.