Aug 19,2022 06:34

భారతదేశం యావత్తూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. భారత జాతీయోద్యమం ఒక గొప్ప చారిత్రిక పోరాటం. రెండు వందల సంవత్సరాలకు పైగా ఈ భారత ఉప ఖండాన్ని ఆక్రమించుకుని, దాని సిరి సంపదలను కొల్లగొట్టిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుండి ఈ దేశాన్ని విముక్తి చేసిన ఉద్యమం అది. భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు ఎందరో స్వతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వేల మంది నిర్బంధాలపాలయ్యారు. లక్షలాదిగా ప్రజానీకం మహాత్ముడి పిలుపులనందుకొని ఉద్యమాల బాటలో నడిచారు. ఇందరి అశేష త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర భారతదేశాన్ని నేడు పాలిస్తున్నది బిజెపి. మోడీ-షా ద్వయం. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో నడుచుకుంటూ ఈ దేశ ప్రయోజనాలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల స్వార్ధానికి బలి పెడుతోంది. అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ దేశ స్వావలంబననే దెబ్బ తీస్తోంది.
ఆనాటి జాతీయోద్యమంలో ఏ విధమైన పాత్రా పోషించకపోవడమే గాక, బ్రిటిష్‌ వాడి 'విభజించి పాలించు' వ్యూహాన్ని అమలు చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భాగస్వామి అయింది. దేశ ప్రజలందరూ కుల, మత, భాషా, ప్రాంతీయ భేదాలను అధిగమించి సమైక్యంగా ఉద్యమించి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూంటే, ఆ ప్రజానీకం మధ్య మత విద్వేషాలను రగిల్చి ఉద్యమాన్ని దెబ్బ తీయాలన్న బ్రిటిష్‌ పాలకుల కుట్రలకు యధాశక్తి తోడ్ప డింది. అయినప్పటికీ, ఈ దేశ ప్రజలు చైతన్యంతో ఆ కుట్రలను అధిగమించి ముందుకు సాగారు. చివరికి బ్రిటిష్‌ వాడు తోక ముడవక తప్పలేదు. ఆ దశలో ఒకవైపు నుండి ఆర్‌ఎస్‌ఎస్‌, ఇంకోవైపు నుండి ముస్లిం లీగ్‌ 'ద్విజాతి' సిద్ధాం తాన్ని ముందుకు తెచ్చారు. ఈ దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చాలని ప్రయత్నించారు. చివరికి భారత్‌, పాకిస్తాన్‌ గా రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. దేశ విభజన సందర్భంగా మళ్ళీ మత కల్లోలాలను రెచ్చగొట్టడంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ముస్లిం లీగ్‌ ముఖ్య పాత్రను పోషించాయి. ప్రజల సమైక్యత కోసం గట్టిగా నిలబడ్డ మహాత్ముడి ప్రాణాలను బలిగొనడానికి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధపడింది. ఇన్ని రకాలుగా దేశ ప్రజల సమైక్యతను దెబ్బ తీయడానికి పలుమార్లు ప్రయత్నించిన విచ్ఛిన్నకర శక్తి చేతుల్లో నేడు ప్రభుత్వ అధికారం చిక్కుకుంది. జాతీయోద్యమానికి ఎనలేని ద్రోహం చేసిన శక్తులే నేడు స్వాతంత్య్రోత్సవ వేడుకలు నిర్వహించడం కన్నా వికృత, విషాద స్థితి వేరే ఏమైనా ఉంటుందా? గాడ్సే ను దేశభక్తునిగా కీర్తించే పాలకులు వస్తారని ఆ నాటి త్యాగాలను అవహేళన చేసే దుస్థితి కలుగుతుందని అనుకున్నామా?
మన దేశంలో ప్రజల ఐక్యతకు సవాళ్ళుగా కుల తత్వం, మత తత్వం, భాషా విభేదాలు, ప్రాంతీయ అసమానతలు మన ముందు ఉన్నాయి. నేటికీ ఆధునిక సమాజ జీవనానికి అందనంత దూరంగా కోట్లాది మంది గిరిజనులు ఈ దేశంలో ఉన్నారు. బ్రిటిష్‌ పాలకులు ఉన్నంతకాలమూ ఈ విభేదాలను ఉపయోగించుకుని తమ పెత్తనానికి, దోపిడీకి అడ్డు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను తొలుత ఈ దేశం నుండి పారదోలనిదే దేశ ప్రజానీకాన్ని ఆ ప్రతిబంధకాల నుండి బైటకు తీసుకురాలేమని జాతీయోద్యమ నాయకులు గ్రహించారు. ఒకసారి బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి సాధిస్తే, ఆ తర్వాత దేశ సమైక్యత, సమగ్రతల కోసం పాటుపడవచ్చునని తలచారు.
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా దేశ సమైక్యతకు పలుమార్లు తీవ్ర సవాళ్ళు ఎదురయ్యాయి. ఈ సవాళ్ళను ఎదుర్కొని దేశాన్ని, ప్రజలను ఐక్యంగా నడిపించడానికి జాతీయ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. మత ఘర్షణలతో, మహాత్ముని హత్యతో గాయపడిన దేశాన్ని సమైక్యంగా నిలపడానికి పూనుకుంది. అందులో భాగంగా జాతీయ సమగ్రతామండలిని ఏర్పాటు చేసింది. 'భిన్నత్వంలో ఏకత్వం' ఈ దేశ సమగ్రతకు ప్రాతిపదికగా ఉండాలని జాతీయోద్యమ నేతలు ఆకాంక్షించారు. దానికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామిక, ఫెడరల్‌ సూత్రాల ప్రాతిపదికన రాజ్యాంగం రూపొందింది. సామాజిక న్యాయం, స్వావలంబన సాధించే లక్ష్యాన్ని దేశం ముందుంచింది.
ఐతే, ఈ దేశంలో బలంగా వేళ్ళూనుకుని ఉన్న అభివృద్ధి నిరోధక, ఛాందసవాద, విచ్ఛిన్నకర శక్తులు తమ కుట్రలను కొనసాగిస్తూనే వచ్చాయి. ఈ 75 సంవత్సరాల కాలంలో కుల పరంగా దాడులు, మత ఘర్షణలు, ప్రాంతీయ వేర్పాటు ఉద్యమాలు, భాషా దురభిమాన ఉద్యమాలు పలు మార్లు తలెత్తాయి. కొన్ని బూర్జువా పార్టీల రాజకీయ అవకాశ వాదం ఈ తరహా ఉద్యమాలకు ఊతం ఇచ్చింది. ఈశాన్య ప్రాంతంలో అసోం వేర్పాటువాదం, పంజాబ్‌ లో ఖలిస్తాన్‌ నినాదం, ఉత్తర బెంగాల్‌ లో గూర్ఖాల్యాండ్‌ నినాదం వంటివి దేశ సమగ్రతను తీవ్రంగా సవాలు చేశాయి. దేశ సమైక్యతతో పాటే తమ అభివృద్ధి కూడా ముడిపడి వుందని గ్రహించిన పాలక వర్గాలు ఈ విచ్ఛిన్నకర ఉద్యమాలను ఆనాడు అదుపుచేయడానికే ప్రయత్నించాయి.
1990 దశకంలో పాలక వర్గాలు దేశంలో నయా ఉదారవాద విధానాలను అమలు చేయడానికి పూనుకున్నాయి. విచ్చలవిడిగా దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడమే ఈ విధానాల సారాంశం. దాని పర్యవసానంగా దేశ ప్రజానీకపు జీవన పరిస్థితులు ఘోరంగా దిగజారిపోతున్నాయి. ఆ ప్రజల నుండి తమ విధానాలకు ప్రతిఘటన ఎదురు కాకుండా వుండాలంటే ప్రజల ఐక్యతను దెబ్బ తీసి, వారి మధ్య విభేదాలను పెంచి పెద్ద చేయడం పాలక వర్గాల ఆధిపత్య వ్యూహంలో భాగంగా మారిపోయింది. దేశ సమైక్యత ఇంకెంతమాత్రమూ వారికి ప్రాధాన్యతాంశంగా లేకుండా పోయింది. ఈ పరిస్థితిని మితవాద, ఛాందసవాద శక్తులు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉపయోగించుకోడానికి పూనుకున్నాయి. బాబ్రీ మసీదు వివాదం దేశ వ్యాప్త సమస్యగా పెరిగిపోయింది. పాలక పార్టీలు దాని విచ్ఛిన్నకర స్వభావాన్ని పట్టించుకోకుండా, హిందూత్వ శక్తుల పట్ల మెతక వైఖరినే అసుసరించాయి. దీనితో మత విద్వేష రాజకీయాలకు, ఛాందసవాద శక్తులకు పెద్ద ఊతం లభించింది. దానికి కార్పొరేట్‌ శక్తుల ఆదరణ తోడైంది. పర్యవసానంగా ఆ మతోన్మాద శక్తులే దేశ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు దేశ సంపదను, ప్రజల ఉమ్మడి ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టడానికి విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అడ్డూ, ఆపూ లేకుండా పోయింది. జాతీయోద్యమం అనంతరం ప్రజలు నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌధం మీద, లౌకిక, సోషలిస్టు విలువల మీద తీవ్రమైన దాడి పాలకవర్గాల వైపు నుండే జరుగుతోంది. జాతీయ సమగ్రతా మండలి అటకెక్కింది. కంచే చేను మేస్తోంది.
ఈ పరిస్థితుల్లో దేశాన్ని, ప్రజానీకాన్ని విధ్వంసం నుండి కాపాడుకోవడం లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ప్రధాన కర్తవ్యం. ఆనాడు జాతీయోద్యమానికి కండపుష్టినిచ్చిన రైతాంగం, కార్మికవర్గం, మధ్యతరగతి ప్రజానీకం, దళిత, గిరిజన ప్రజానీకం, సామాన్య మహిళలు, నేడు మళ్ళీ దేశం కోసం కదం తొక్కాల్సిన తరుణం వచ్చింది. ఆనాటి జాతీయోద్యమానికి ప్రధాన నాయకత్వం దేశంలోని బూర్జువా వర్గం అందించింది. ఇప్పుడు ఆ వర్గమే దేశ సమైక్యతకు చిచ్చు పెట్టే శక్తులకు ఊతం ఇస్తోంది. అందుచేత దేశ సమైక్యతను, ప్రజల సమైక్యతను కాపాడుకునే కర్తవ్యంలో కార్మిక వర్గం, రైతాంగం, మధ్యతరగతి ప్రజానీకం, ఇతర లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ముందుండాలి. నాయకత్వం వహించాలి.

mvs

 

 

 

 

ఎం.వి.ఎస్‌. శర్మ