Sep 23,2022 07:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి/గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరింత అభివృద్ధిని సాధించొచ్చని కేంద్ర రోడ్డు, రవాణ, రహదారుల శాఖ మంత్రి నితన్‌ గడ్కరీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆయన గురువారం రాజమహేంద్రరవం వచ్చారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు రూ. మూడు వేల కోట్లతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులను వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్‌ అధ్యక్షతన ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ... రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకూ రెండు లైన్ల రహదారి పనులను త్వరలోనే చేపడతామన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రూ.215కోట్లతో రాజమహేంద్రవరంలోని మోరంపూడి వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ - విశాఖపట్నం నుంచి కాకినాడ సెజ్‌, సెజ్‌ పోర్ట్‌, ఫిషింగ్‌ హార్బర్‌, కాకినాడ యాంకరేజ్‌ పోర్టులను కలుపుతూ ఎన్‌హెచ్‌ 516ఎఫ్‌ రహదారి పనులు చేపడతామన్నారు. సామర్లకోట, అన్నవరం, బిక్కవోలు, ర్యాలీ, పిఠాపురం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను ఈ హైవే కలుపుతుందని పేర్కొన్నారు. దీని వల్ల రవాణా సౌకర్యాలు పెరిగి టూరిజం రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంపి భరత్‌ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మరిన్ని జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి గడ్కరీని సత్కరించారు.
నాలుగు కోట్ల ఉద్యోగాలు రానున్నాయి
రాబోయే కొద్ది రోజుల్లో ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌్‌, ఎలక్ట్రిక్‌ రంగాల్లో నాలుగు కోట్ల ఉద్యోగ అవకాశాలు రానున్నయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో విజ్ఞాన్‌ డీమ్డ్‌ టుబి యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత బయోటెక్‌ చైర్మన్‌, ఎండి కృష్ణ ఎల్లా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌ డైరెక్టర్‌ ఎం.వి.రెడ్డి, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. గడ్కరీ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని, విద్యుత్‌ను అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధకులు ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. నూతన ఆలోచనల వెంట యువత పరుగెత్తాలన్నారు. ఎవరికి వారు మనకెందుకులే అన్న థోరణి విడనాడి సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు.