Aug 04,2022 21:58

సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ధర్నా
ప్రజాశక్తి - విజయవాడ :  
అమరావతిని నిర్వీర్యం చేస్తూ, రాజధాని అభివద్ధి సాకుతో నిర్వహిస్తోన్న సిఆర్‌డిఎ లేఅవుట్ల స్థలాల వేలం పాటను వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజధాని అభివృద్ధికి నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. సిఆర్‌డిఎ లే అవుట్లలోని ప్రజా ప్రయోజనాలకు నిర్దేశించిన స్థలాలను తెగనమ్మే జిఒ 390 రద్దు చేయాలని, వేలం పాటలు ఆపాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని సిఆర్‌డిఎ కార్యాలయం, లెనిన్‌ సెంటర్‌లో గురువారం ఆందోళన నిర్వహించారు. జిఒ కాపీలను దగ్ధం చేశారు. అనంతరం సిఆర్‌డిఎ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి అడ్డదారులు తొక్కడం తగదన్నారు. ప్రజాప్రయోజనార్థం కేటాయించిన స్థలాలకు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వారు ధర కట్టి ప్లాట్లను ప్రజలకు విక్రయించారన్నారు. ఇప్పుడు అవే భూములను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి ఆ స్థలాల్లో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేని పేర్కొన్నారు. ఇది ఒప్పందాన్ని ధిక్కరించడమేనని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ మూడేళ్లలో రాజధానిని ఛిన్నాబిన్నం చేసిన వైసిపి ప్రభుత్వం, ఇప్పుడు అమరావతి అభివద్ధికి నిధుల పేరుతో స్థలాలు అమ్మడం దారుణమన్నారు. విజయవాడ పాయకాపురం ఉడా కాలనీ, తెనాలి చెంచుపేట ఉడా కాలనీ, అమరావతి నవులూరు కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలకు కేటాయించిన స్థలాలను వేలానికి పెట్టడం సిగ్గుచేటన్నారు. కష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో అభివద్ధి పనులకు సిఆర్‌డిఎ నిధులు ఇవ్వకుండా అడ్డదారుల్లో ఖజానా నింపుకునే పనికి పూనుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ నాయకులు కె.శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణారావు, తదితరులు పాల్గొన్నారు.