Jul 01,2022 20:30

ఎపిఇపిడిసిఎల్‌ సిఎండి కార్యాలయం వద్ద మీటర్‌ రీడర్ల ధర్నా
ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం) : 
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఇపిడిసిఎల్‌ పరిధిలోని మీటర్‌ రీడర్లు శుక్రవారం విశాఖలోని ఆ సంస్థ సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన మీటర్‌ రీడర్లు 'చలో సిఎండి కార్యాలయం' పేరిట నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ మీటర్‌ రీడర్ల పని దినాలు తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, పీసు రేటు విధానాన్ని రద్దు చేసి నెలవారీ జీతాలు చెల్లించాలని, జీతాల్లో కోతలు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు మీటర్‌ రీడర్లకు ఇచ్చిన హామీని సిఎం జగన్మోహన్‌ రెడ్డి నెరవేర్చాలని కోరారు. ఎపి ఇపిడిసిఎల్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ 2021 డిసెంబర్‌ 22న నాటి విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి నేటికీ పరిష్కారమార్గం చూపలేదన్నారు. అనంతరం సిఎండి సంతోష్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ మీటర్‌ రీడర్ల పని దినాలు కుదించబోమని, ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌.రామకృష్ణ, కెఎస్‌డిఎస్‌కె.రెడ్డి పాల్గొన్నారు.