Aug 05,2022 22:52

న్యూఢిల్లీ : డేటా పరిరక్షణకు సరైన చట్టం ఏదీ లేనందున ఆధార్‌ను ఓటరు గుర్తింపుకార్డుతో అనుసంథానానికి తాము వ్యతిరేకమని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు.. ఆధార్‌తో లింకు పెట్టి ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియను ఎన్నికల సంఘం తిరిగి ప్రారంభించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం భద్రత, గోప్యత ప్రమాదంలో పడే అవకాశముందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు, ఓటరు జాబితాలో పేర్ల చేర్పింపునకు సాధికారిత చేకూర్చేందుకే ఆధార్‌తో అనుసంధానం ఉద్దేశించబడిందని ఇసి వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ ఎన్నికల జాబితా పునర్వ్యవస్థీకరణాప్రామాణీకరణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రక్రియను 2015లోనే చేపట్టగా, సుప్రీం కోర్టు నిలుపుచేసేవరకు కొనసాగింది. ఈ ప్రక్రియలో భాగంగా, దేశవ్యాప్తంగా పలువురు ముఖ్య ఎన్నికల అధికారులు ఎన్‌పిఆర్‌, పిడిఎస్‌, స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్స్‌ (ఎస్‌ఆర్‌డిహెచ్‌) వంటి పలు డేటాబేస్‌ల ద్వారా ఓటర్ల ఆధార్‌ డేటాను సేకరించారు. ఈ ఎన్నికల కార్యాలయాలు 31కోట్ల మంది ఓటర్ల ఓటర్‌ ఐడితో ఆధార్‌ను అనుసంథానం చేశాయి. ఆయా ఓటర్లకు కనీసం తెలియచేయకుండానే ఇది జరిగింది. పైగా అప్పటికే వున్న డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా అనుసంథానమయ్యేలా అల్గోరిథమ్‌లను ఉపయోగించారు. ఈ ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లు తొలగించబడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో ఇది బాగా కనిపించింది. మొట్టమొదటగా ఆధార్‌ను ఓటర్‌ ఐడితో అనుసంథానించే ఎన్‌ఇఆర్‌పిాఎపి ప్రక్రియ తెలంగాణాలోనే అభివృద్ధిచేయబడింది. ఫలితంగా ఓటర్ల తొలగింపులు చోటు చేసుకున్నాయి. దీనివల్ల తెలంగాణాలో అసలైన ఓటర్లు అనేక మంది ప్రభావితమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదంతా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో ఆధార్‌కు అనుసంథానమైన ఓటర్‌ ఐడి డేటా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.
ఆధార్‌కి సంబంధించి గతంలో ఓటర్ల జాబితాలో ఇన్ని అవకతవకలు జరిగినా, ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందుగానే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం డేటా రక్షణ లేదా గోప్యతా చట్టం లేదు. లేదా ఓటర్ల ఆధార్‌ డేటా నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు గోప్యతా విధానం లేదు. ఆధార్‌ ఓటర్‌ ఐడి అనుసంధానానికి ప్రధాన ప్రయోజనం డూప్లికేట్‌ ఓటర్లను తొలగించడమే. కానీ, యుఐడిఎఐపై కాగ్‌ తన నివేదికలో లేవనెత్తినట్లుగా డూప్లికేట్‌ ఆధార్‌కి సంబంధించిన ఆందోళనలు దృష్టిలో వుంచుకుంటే ఇది చాలా తొందరపాటు ప్రక్రియే అవుతుంది. ఎన్నికల కమిషన్‌ చేపట్టాల్సిన చర్యలు చేపట్టకపోవడం, ప్రతి ఓటరు ఆధార్‌ను అనుసంధానించే తొందరపాటు ప్రక్రియ ఈ రెండూ కలిసి గతంలో తలెత్తినట్లుగా నిజమైన ఓటర్లను తొలగించడం వంటి సంఘటనలకు దారి తీస్తాయి.
డేటా భద్రత కొరవడడం, ఓటర్ల తొలగింపులు, వివిధ ప్రభుత్వ నిఘా డేటా బేస్‌లకు ఎన్నికల కమిషన్‌ డేటాను ఉపయోగించడం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. ఓటర్ల తొలగింపులు, డేటా ఉల్లంఘనల్లో జరిగిన తీవ్రమైన లోపాలపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఓటర్ల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈ సంఘటనలపై ఎన్నికల కమిషన్‌ దర్యాప్తు నివేదికను అందచేసేవరకు, స్పష్టమైన తనిఖీ యంత్రాంగాలు ఏర్పాటు చేసేవరకు ఈ అనుసంథాన ప్రక్రియను నిలుపుచేయాలి.
ఈ ప్రక్రియను అనుమతిస్తూ 2021లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడానికి ముందుగా సేకరించిన ఆధార్‌ డేటా నంతటినీ ఎన్నికల కమిషన్‌ తొలగించాలి. ఓటర్లకు సరైన సమాచారం ఇవ్వకుండా గతంలో ఈ అనుసంథానాన్ని అధికారులు నిర్వహించినందున ఓటర్‌ ఐడితో ఆధార్‌ అనుసంథానమైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించాలి. ఈ మొత్తం అనుసంథాన ప్రక్రియ స్వచ్ఛందమైనందున, అవసరమైతే తమ ఆధార్‌ అనుసంథానాన్ని రద్దు చేసుకునే హక్కును కూడా ఓటర్లకు అనుమతించాలి. ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగానే మొత్తం ఈ సాంకేతిక క్రమాలు, గోప్యతా విధానాలు ఆధార్‌, ఓటర్‌ ఐడి అనుసంథానానికి సంబంధించిన, తొలగించడానికి సంబంధించిన నిబంధనలు, మాన్యువల్స్‌ అన్నింటినీ ప్రచురించాల్సిన అవసరం వుంది. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం కూడా వుంది.
డేటా రక్షణ చట్టం లేకపోవడంతో, ఆధార్‌తో లింక్‌ అయిన ఓటర్‌ ఐడిలన్నింటినీ నాట్‌గ్రిడ్‌ డేటాబేస్‌ నిర్మాణం కోసం, జాతీయ జనాభా రిజిస్ట్రీ, జాతీయ పౌరుల పట్టిక, కొత్తగా రాబోయే జనన, మరణాల నమోదు పట్టికల కోసం కేంద్ర హోం వ్యవహారాల శాఖతో పంచుకోవడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే సేకరించిన డేటాను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ డేటాకు పరిమిత ప్రయోజనం వుండాలని డిమాండ్‌ చేస్తున్నాం. భారత ఎన్నికల కమిషన్‌ గోప్యతా పద్దతులను, విధానాలను అమలు చేయాల్సిన అవసరం వుంది.
ఈ డేటా సేకరణ, వినియోగించే ప్రయోజనం కేవలం డూప్లికేట్‌ ఓటర్లను తొలగించడానికే పరిమితం కావాల్సి వుంది. అది కూడా పుట్టస్వామి వర్సెస్‌ భారత ప్రభుత్వం (2018)లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తప్పనిసరి కాదు. ఇందుకు సంబంధించి, అన్ని డేటా పద్దతులను, గోప్యతా విధానాలను ఎన్నికల అధికారులందరూ అనుసరించాల్సిన అవసరం వుందంటూ భారత ఎన్నికల కమిషన్‌ అన్ని ముఖ్య ఎన్నికల అధికారులను, జిల్లా ఎన్నికల అధికారులను, ఎలక్టోరల్‌ రిజిస్ట్రషన్‌ అధికారులను, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను ఆదేశించాల్సిన అవసరం వుంది. వీటిల్లో దేన్ని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్‌ వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వుంది.