Jun 02,2023 08:56

మలబద్దకం సమస్య పెద్దవాళ్లనే కాదు పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. పిల్లల్లో ఈ సమస్య ఉన్నప్పుడు కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఉబ్బరం వంటి వాటితో బాధపడుతుంటారు. వారానికి మూడు లేదా అంతకంటే తక్కువ సార్లు విసర్జన చేస్తున్నట్లైతే దాన్ని మలబద్దకంగా భావించాలి.

                                                                సమస్య ఎందుకు వస్తుంది..

తక్కువ నీరు త్రాగడం, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం, ఆహారంలో అధిక కొవ్వులు తీసుకోవడం, వ్యాయామం తగ్గించడం మొదలైన వాటి వల్ల ఈ సమస్య వస్తుంది.
 

                                                               పుష్కలంగా నీరు త్రాగించాలి

పిల్లలకు నీరు ఎక్కువ తాగడం అలవాటు చేయాలి. రోజూ 6 నుంచి 7 గ్లాసుల నీరు తాగడం అవసరం. మలబద్దకం ఉంటే నీరు తాగించే పరిమాణం పెంచవచ్చు. ఈ కారణంగా, శరీరం నుండి టాక్సిన్స్‌ సులభంగా తొలగించబడతాయి.
 

                                                                          పీచుపదార్థాలు

మలవిసర్జన సజావుగా జరగాలంటే పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాలు, పచ్చి కూరగాయలు, పీచుతో కూడిన పండ్లు, బీన్స్‌, పప్పులు తప్పనిసరిగా తినిపించాలి.
 

                                                                          అవిసె గింజలు

అవిసె గింజల్లో అధికమోతాదులో ఫైబర్‌ ఉంటుంది. ఈ గింజలను పొడి చేసి రసం, స్మూతీ, సలాడ్‌, పెరుగు, సూప్‌ మొదలైన వాటితో కలిపి తీసుకోవచ్చు.
 

                                                              గోరువెచ్చని పాలు, అరటిపండు

మలబద్దకంతో బాధపడే పిల్లలకు గోరువెచ్చని పాలతో కలిపి అరటిపండ్లను తినిపించాలి. ఇలా చేస్తే శరీరం నుండి మలం సులభంగా బయటకు వెళుతుంది.
 

                                                                            అవుట్‌డోర్‌ గేమ్స్‌

పిల్లలను ఫిజికల్‌ గేమ్స్‌ వైపు ప్రోత్సహించాలి. ఫలితంగా మలబద్దకం సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. అయితే పిల్లలు తరచూ కడుపు నొప్పి అంటుంటే మాత్రం అది నులిపురుగుల సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో డాక్టర్‌ సలహా మేరకు చికిత్స ప్రారంభించాలి.