Jan 31,2023 20:47
  •  ఏలూరు డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద ఆశాల ధర్నా

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌ : తమతో ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దని ఆంధ్రప్రదేశ్‌ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ఆశాలు ధర్నా చేశారు. అనంతరం డిఎంహెచ్‌ఒ ఎం.నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ మాట్లాడుతూ..15 ఏళ్లుగా వైద్య, ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశాలతో సంబంధంలేని ఆన్‌లైన్‌ పనులు చేయిస్తూ వేధింపులకు గురి చేయడం తగదని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆశాలను సచివాలయాలకు అనుసంధానం చేయడం దారుణమన్నారు. నెలలో మూడు రకాల సర్వేల పేరుతో సంవత్సరానికి 30 రికార్డులు రాయిస్తున్నారని తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. సమయంతో నిమిత్తం లేకుండా ఆశాలు రోజంతా కష్టపడుతున్నారని తెలిపారు.. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్‌లు పనిచేయకపోయినా సొంత ఫోన్‌లు కొనుగోలు చేసి పనులు చేయాలని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ యూనియన్‌ నాయకులు కె.విజయలక్ష్మి, ఆశా యూనియన్‌ జిల్లా నేతలు పాల్గొన్నారు.