
మార్చి నెల అంటే పిల్లలకు పరీక్షల సమయం. సంవత్సరం పొడవునా చదివిన మొత్తం పాఠాలను తిరిగి చదవడం, వాటిని గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాయడం అనేది పిలల్లకు నిజంగా ఓ సవాలే. రోజుకో సబ్జెక్టు చదవాలి. ఉన్న తక్కువ సమయంలోనే అన్నిటిని కవర్ చేస్తూ చదువుకోవాలి. ఈ క్రమంలో పిల్లలు ఆందోళనతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. అటువంటి సమయంలో తల్లిదండ్రులు వారికి తోడుగా నిలబడాలే తప్పా మరింత ఒత్తిడి పెంచేలా మాట్లాడకూడదు.
- తోటి పిల్లల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల, టీచర్ల మెప్పు పొందాలనే తపనతో పిల్లలు రాత్రుళ్లు నిద్రపోకుండా చదువుతారు. ఇది మంచి పద్ధతి కాదు. నిద్ర మెదడుకు చాలా అవసరం. చదివింది గుర్తు ఉండాలంటే మెదడుకు విశ్రాంతినివ్వాలి. అంటే తగినంత నిద్రపోవాలి. వారిని' మెల్కొని చదువు' అని ఒత్తిడి చేయకుండా నిద్రపొమ్మని చెప్పాలి.
- సబ్జెక్ట్‌లన్నీ ఒకేలా ఉండవు. పిల్లలందరూ అన్ని సబ్జెక్టుల్లో ఒక్కలా తెలివి ప్రదర్శించలేరు. కొన్ని కష్టంగా, కొన్ని సులభంగా ఉంటాయి. అందుకే పరీక్షలు ఎలా రాసినా వారిని స్వీకరించాలి.
- జవాబు తెలిసినా సరిగ్గా రాయకపోవడం, ప్రశ్న పత్రాలు సరిచూసుకోవడం, ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకోవడం సహజం. అప్పుడు వారు కుంగిపోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మార్కులు తక్కువ వస్తాయని భయపడటం, ఫెయిల్ అవుతామని ఏడ్వడం చేస్తారు. అది చూసి తల్లిదండ్రులు నిరుత్సాహపడకూడదు. 'ఏం పర్వాలేదు...మళ్లీ రాసుకోవచ్చు' అని ధైర్యాన్ని ఇవ్వాలి. దాంతో వారిలో ఒత్తిడి తగ్గి, కుంగుబాటుకు లోనుకారు.
- కొంత మంది పిల్లలు ఒకటి, రెండు మార్కులు తగ్గినా తట్టుకోలేరు. ఏడుస్తారు. అరిచి, గోల చేస్తుంటారు. వీరిని కూడా సమర్థించడం తల్లిదండ్రులకు సమస్యే. 'ఈ సారికి వదిలేయమని' పదే పదే చెబుతుండాలి.
- మొదటి నుంచి పూర్‌గా ఉన్న సబ్జెక్టులో ఇప్పుడు మార్కులు తెచ్చుకునే ప్రయత్నంగా ట్యూషన్‌కు పంపడం, ప్రత్యేకమైన క్లాసులు ఇప్పించడం చేయకూడదు. ఇది వారి మెదడకు మరింత భారంగా మారి ఒత్తిడి పెంచినట్లే.
- మొదట పిల్లలకు తల్లిదండ్రులే స్నేహితులవ్వాలి. అన్ని విషయాలు చెప్పుకునేలా స్వేచ్ఛనివ్వాలి. దిగులుగా ఉంటే ప్రేమగా మాట్లాడాలి. అప్పుడే వారి మనసులో భావాలు, సామర్థ్యాలు అర్థమవుతాయి. కొందరు ఇంగ్లిష్‌లో బాగా చదివి లెక్కల్లో పూర్‌గా ఉంటారు. కొందరు సైన్స్ బాగా చదివి తెలుగు తప్పులు రాస్తారు. ఏ సబ్జెక్ట్‌లో వారికి ఎటువంటి సమస్య ఉందో తెలుసుకుని వదిలేయాలి.