Feb 07,2023 21:10
  •  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు అమ్మడం తగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ, యు.రామస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 726వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ డిపార్టుమెంట్‌ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నేతలు మాట్లాడుతూ.. అదానీ లాంటి కార్పొరేట్‌ వ్యక్తులకు ప్రభుత్వ రంగ ఆస్తులను, ప్రాజెక్టులను అప్పగించడం దారుణమన్నారు. ప్రగతికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమంటే దేశ సంపదను దోచుకు తినడమే అవుతుందని విమర్శించారు. ఉక్కు కార్మికులు చేస్తున్న సుదీర్ఘ పోరాటాలకు ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడానికి స్థానిక ఆందోళనలు, కార్మికుల ప్రతిఘటనలు ప్రతిబంధకంగా మారాయని కేంద్ర స్థాయి అధికారులు చెబుతుండడమే పోరాట ఫలితానికి నిదర్శనమని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కార్మికులను కోరారు. దీక్షల్లో సాయిరాం, రవికిరణ్‌, ఈశ్వరరావు, మధు, వెంకటరావు, నగేష్‌, నల్ల రవి పాల్గొన్నారు.