Jan 31,2023 21:34

-ఆ పార్టీ పార్లమెంట్‌ అజెండాలో కానరాని స్టీల్‌ప్లాంట్‌ అంశం
-విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీపైనా నోరుమెదపరేం?
-పోలవరం నిర్వాసితులపై నిర్లక్ష్యం తగదు
-అదానీ విషయంలో వైసిపి, టిడిపిలు వైఖరిని స్పష్టం చేయాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- గాజువాక (విశాఖపట్నం) :దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోన్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై వైసిపికి చిత్తశుద్ధి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించబోయే అంశాల్లో ఉక్కు కర్మాగారం ప్రస్తావనే ఆ పార్టీ తేవకపోవడం ఇందుకు తాజా ఉదాహరణనని తెలిపారు. గాజువాకలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జరిగిన ఉక్కు ప్రజా గర్జన విజయవంతమైందని తెలిపారు. ఈ సభలో బిజెపి మినహా అన్ని పార్టీలూ పాల్గన్నాయన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అగ్రభాగాన ఉండి నడిపిస్తామని ఉక్కు ప్రజాగర్జన సభలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి చెప్పారని, అయితే, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అఖిలపక్ష సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశాన్నే ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. దీన్నిబట్టి స్టీల్‌ప్లాంట్‌పై వైసిపి అసలు వైఖరేంటో అర్థమవుతోందని తెలిపారు. వైసిపి సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను శ్రీనివాసరావు ప్రదర్శించారు. ఇప్పటికైనా కార్మికులు, నిర్వాసితుల పోరాటాన్ని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి స్టీల్‌ప్లాంట్‌ విషయంపై పార్లమెంటరీ బోర్డు సమావేశం వేసి, అన్ని పార్టీలనూ కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.
విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వంటి విషయాలూ వైసిపి పార్లమెంట్‌లో చర్చించబోయే అంశాల్లో లేవని శ్రీనివాసరావు తెలిపారు. పోలవరం గురించి తూతూ మంత్రంగా ప్రస్తావించారన్నారు. గతేడాది వరదల సమయంలో రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప, సిఎం జగన్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. ఇళ్లకు, పంటలకు నష్టపరిహారం నేటికీ ఇవ్వలేదని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యం తగదన్నారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదికను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ నియమించి సమగ్ర విచారణ జరపాలని, అదానీ విషయంలో వైసిపి, టిడిపిలు తమ వైఖరులు ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు సహా పలు ప్రాజెక్టులను, భూములను అదానీకి అప్పగించారని, వాటన్నింటినీ తాజా ఘటనల నేపథ్యంలో పెండింగ్‌లో పెట్టాలని కోరారు. అదానీకి రుణాలు ఇచ్చిన ఎస్‌బిఐ, ఎల్‌ఐసి దెబ్బతిన్నట్టే రానున్న కాలంలో జాగ్రత్త వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వమూ మునిగిపోతుందని తెలిపారు. ప్రజలపై భారాలు పడతాయన్నారు. ఈ నేపథ్యంలో అదానీకి రాష్ట్రంలోని కేటాయింపులపై న్యాయవిచారణ జరపాలని, అప్పటి వరకూ కేటాయింపులు ఆపేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు పాల్గొన్నారు.