
- 80 కిలోల బస్తాకు రూ.16 వేలు ప్రకటించాలి : రైతు సంఘం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : జీడి పిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహనరావు తెలిపారు. జీడి పిక్కలకు మద్దతు ధరపై ప్రజా సంఘాల ఆధ్వర్యాంలో శ్రీకాకుళం నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీడి పిక్కల 80 కిలోల బస్తాకు రూ:16 వేలు చెల్లించాలని, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఐదు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. జీడి పిక్కల ధర దిగజారిపోతుంటే, పప్పు ధర ఆకాశాన్ని తాకుతోందన్నారు. 2019లో 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.14 వేలు ఉంటే నేడు రూ.7 వేలకు పడిపోయిందని తెలిపారు. దీంతో, జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. జీడి పిక్కలకు మద్దతు ధర, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు మహారాయభారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎపి జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘం, మత్స్యకార సంఘం, సిఐటియు, ఎఐటియుసి నాయకులు పాల్గొని మాట్లాడారు.