Sep 19,2023 22:14

- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
- 77 చెరువులకు నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం
-అక్టోబరులో వెలిగొండ రెండో టన్నెల్‌ జాతికి అంకితం చేస్తామని ప్రకటన
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని, గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ మార్పును, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. తొలుత ఓర్వకల్లు విమానాశ్రయం నుండి కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం ఆలంకొండ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ 77 చెరువులకు నీరు నింపే కార్యక్రమంలో భాగంగా పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా నంద్యాల జిల్లా డోన్‌ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. 77 చెరువులకు 90 రోజుల్లో 1.42 టిఎంసిల నీటిని నింపే కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. పక్కనే శ్రీశైలం రిజర్వాయర్‌ ఉన్నా మెట్ట ప్రాంతాలకు నీరందని దారుణ స్థితి ఉందని, దీనిపై గతంలో ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మోసం చేసేందుకు గత ప్రభుత్వం జిఒ ఇచ్చిందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెరువులకు నీళ్లు నింపే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని వివరించారు. అనేక రకాలుగా ఉపయోగపడుతున్న గాజులదిన్నే ప్రాజెక్టు సామర్థ్యం పెంచామన్నారు. అదనంగా నీళ్లు కేటాయించామని తెలిపారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు... హంద్రీనీవాకు రూ.13 కోట్లు ఖర్చు మాత్రమే చేశారని అన్నారు. రాజశేఖరరెడ్డి రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారు కాబట్టే ఈ రోజు లిఫ్టుల ద్వారా చెరువులకు నీళ్లు నింపుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం నుండి 800 అడుగులకే నీళ్లు తీసుకునేలా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అక్టోబరులో వెలిగొండ రెండో టన్నెల్‌ జాతికి అంకితం చేస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతోందని, వ్యవసాయం, విద్య, వైద్యం, ఏ రంగం తీసుకున్నా తమ ప్రభుత్వానికి సాటి ఎవరూ లేరని పేర్కొన్నారు. ఇంట్లో మంచి జరిగి ఉంటే మళ్లీ ఆశీర్వదించి తోడుగా నిలవాలని కోరారు. ఈ సభలో ముఖ్యమంత్రికి నాగలిని వైసిపి నాయకులు బహూకరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు రూ.300 కోట్ల కుంభకోణం చేస్తే చట్టం తనపని తాను చేసుకుంటూపోతోందన్నారు. టిడిపి శ్రేణులు నిరాహార దీక్ష చేస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రతిపక్షం తప్పులను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు. ఈ సభలో డిప్యూటీ సిఎం, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు అంబటి రాంబాబు, గుమ్మనూరు జయరాం, ఎంపిలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్‌ కుమార్‌, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్‌ జి.సృజన, డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

  • కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం నిరసన

డోన్‌ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం నాయకులు ముఖ్యమంత్రి సభలో నిరసన తెలిపారు. ఈ మేరకు ఒక్కసారిగా ఎర్ర జెండాలను ప్రదర్శించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు.