Feb 07,2023 22:36

- ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
- రాజ్యసభలో విజయసాయి రెడ్డి

- పలు అంశాలపైనా నిలదీత
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పార్లమెంటు వేదికగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పలు అంశాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా సాకులతో బిజెపి తప్పించుకుంటోందని తూర్పారబట్టింది. తక్షణమే హోదా ఇవ్వాల్సిందేనని, అలాగే విభజన చట్టం కింద ఇచ్చిన ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేసింది. వెనుకబడిన తరగతులు, మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కూడా విమర్శలు గుప్పించింది.
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి సాకులు చెబుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్‌ పార్టీ, బిజెపి ఉమ్మడిగా విఫలమయ్యాయని అన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ళపాటు ప్రత్యేక హౌదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. కానీ అది ఈనాటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. పార్లమెంటులో ప్రధాని అంతటి వ్యక్తి ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా తుంగలో తొక్కడానికి బిజెపి ప్రభుత్వం వెనకాడటం లేదని విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్ళకు మూల కారణం కాంగ్రెస్‌, బిజెపిలే అన్నారు. సాకులు చెబుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి తప్పించుకుంటోందని, పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీ నేరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. హామీ అమలు అయ్యేలా చూడాల్సిన హామీల కమిటీ సైతం చేతులు ముడుచుకుని చోద్యం చూస్తోందని తప్పుబట్టారు.
- విశాఖపట్నంలో 76 కిలో మీటర్ల మేర మెట్రో రైల్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ పాలసీ 2017కి అనుగుణంగా డిపిఆర్‌ చేయించి పంపించినా ఇప్పటి వరకు దానికి మోడీ సర్కార్‌ ఆమోదం తెలపలేదని విమర్శించారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపాలని కోరారు.
ా దేశ జనాభాలో 50 శాతం పైబడే ఉన్నప్పటికీ 27 శాతం రిజర్వేషన్లకే బిసిలు పరిమితం అయ్యారని, బిసిలకు వారి జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విజయసాయి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
- రాష్ట్రపతి ప్రసంగంలో సుమారు 20 సార్లు మహిళల గురించి చేసిన ప్రస్తావించినప్పటికి, మహిళల భద్రత గురించి ప్రస్తావన లేకపోవడం శోచనీయమని అన్నారు. 2021లోనే దేశవ్యాప్తంగా మహిళలపై నాలుగు లక్షల నేరాలు జరిగాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నా వారి భద్రత కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తప్పుబట్టారు.
-దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని విజయసాయి ఆందోళన వ్యక్తం చేశారు. పని చేసే వయస్సు కలిగిన వారి జనాభా 65 శాతం ఉంటే ఉపాధి పొందుతున్న శ్రామికులు 42 శాతం మాత్రమే ఉన్నారు. జనాభాలో ఏటా కోటి మంది పని చేసే వయస్సుకు చేరుకుంటున్నారు. కానీ 42 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తోందన్నారు.