Jan 31,2023 12:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖపట్నంలో చారిత్రక గుర్తింపు కలిగిన పూర్ణా మార్కెట్‌, ముడసర్లోవ పార్కు స్థలాలను పిపిపి పద్ధతిలో ప్రైవేటువారికి కట్టబట్టే యోచనను జివిఎంసి పాలకవర్గం తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మంగళవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, పార్టీ జిల్లా నాయకులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సహాయ కార్యదర్శి ఎస్‌.కె రెహమాన్‌ నాయకత్వం వహించారు. ఇదే సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్‌ నియోజకవర్గం కన్వీనర్‌ ఎం.శ్రీ భరత్‌, తదితరులు నాయకత్వం వహించారు. బుధవారం జరగనున్న మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలోని ఎజెండాలో పేర్కొన్న, ఈ రెండు అంశాలను తక్షణం రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విరమించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.