
- ఏప్రిల్ వరకు అవసరాలకు 7,100 కోట్లు
- ధాన్యం సేకరణకు 3,093 కోట్లు
- అప్పుల అసలుకు 1,000, వడ్డీకి 914 కోట్లు
- మిల్లర్లకు 1,488 కోట్లు బకాయిలు
- ప్రభుత్వం ముందు భారీ ప్రతిపాదనలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వరికి కాసుల సమస్య వేధిస్తోంది. ఈ ఖరీఫ్ కష్టాల నురచి గట్టెక్కాలంటే ఏకంగా రూ.7,100 కోట్లు అవసరముంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ నిధులు సమకూర్చడం ఖజానాకు భారంగానే అధికారులు చెబుతున్నారు. ధాన్యం సేకరణకే కాకుండా ఇతర అవసరాలు కూడా వేల కోట్లు కావాల్సి ఉండడంతో ఏమి చేయాలన్న కోణంలో అటు పౌరసరఫరాల శాఖ, ఇటు ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు తయారుచేసిన నిధుల అవసరాల జాబితా మేరకు ధాన్యం కొనుగోలుకే 3,093 కోట్లు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని రైతులకు అందించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నిధులను రుణం తీసుకుని కాలం నెట్టుకొచ్చేవారు. రుణదాతలకు అసలు, వడ్డీ భారం కూడా పెరిగిపోవడంతో కొత్త రుణాలు రావడం కష్టమేనని ఆ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర అవసరాలకు మరో 4,002 కోట్లు కావాల్సిన ఉంటుందని వారంటున్నారు. ఇందులో గతంలో నబార్డ్ నుంచి తీసుకున్న రుణంలో వాయిదాలకింద వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉంది. అదే రుణానికి వడ్డీగా మరో రూ.914 కోట్లు చెల్లించాలి.
మిల్లర్లకూ బకాయిలే
ఇక ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు కూడా భారీగానే ఉండిపోయాయి. మొత్తం రూ.600 కోట్లు వరకు మిల్లర్లకు బకాయిలు ఉన్నట్లు ఇటీవల జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రికి కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. ఇక మరో రూ.1488 కోట్లను ధాన్యం కోనుగోలు ప్రక్రియలో ఇతర రంగాలకు అవసరమని వారు వివరిరచారు.
ఏప్రిల్‌లోగానే...
ఈ మొత్తం రూ.7,100 కోట్ల నిధులు కేవలం మూడు నెలల్లోగానే సమకూర్చాల్సి ఉంటుంది. మొత్తం ధాన్యం సేకరణ ఏప్రిల్‌లోగా పూర్తి కావాల్సి ఉన్నందున, ఆ లోగా మొత్తం నిధులను సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముందుగా రూ.3100 కోట్లు విడుదల చేయాలని వారు ఆర్ధికశాఖను కోరుతున్నారు. జనవరిలో రూ.2100 కోట్లు, మార్చిలో రూ.200 కోట్లు, ఏప్రిల్‌లో రూ.800 కోట్లు విడుదల చేయాలని వారు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆర్థికశాఖ కూడా ఈ నిధులను ఎలా సమకూర్చాలన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకులతో చర్చించి కొత్త రుణాల కోసం ప్రయత్నించడం, లేదా ముందుగా ఇతర శాఖల నిధులను పౌర సరఫరాల శాఖకు మళ్లించడంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.