
మనీలా : ఫిలీప్పీన్స్‌లోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం మనీలా విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ అంతరాయం వల్ల డజన్ల కొద్దీ విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు సమాచారాన్ని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పవర్ కట్ వల్ల దేశీయ సిబూ పసిఫిక్ విమానాలు సుమారు 40, టెర్మినల్ 3 రద్దైనట్లు అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ అంతరానికి గల కారణాలను స్పష్టంగా చెప్పకుండా.. విమానాలు రద్దయ్యే అవకాశమున్నట్లు మనీలా నినోరు అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఎయిర్‌లైన్, ఇమ్మిగ్రేషన్ కంప్యూటర్‌లు పాక్షికంగా పనిచేస్తాయి. కానీ వచ్చిపోయే ప్రయాణీకులకు సేవలందించే విధంగా కంప్యూటర్‌లు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణీకులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని మనీలా విమానాశ్రయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ విమానాల రద్దు వల్ల.. ఈ వారాంతంలో.. మేడే సందర్భంగా వచ్చిన సెలవుల రీత్యా బయటకు వెళ్లిన ప్రయాణీకులు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనీలా ఎలక్ట్రిక్ కంపెనీ విద్యుత్ అంతరాయానికి గల కారణాల్ని పరిశీలిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు వెల్లడించారు. అయితే సెబు విమానాల్లో వెళ్లే ప్రయాణీకులకు ఆ విమానాలు రద్దు అవ్వడం వల్ల టికెట్ బుక్ చేసుకున్న వారి డబ్బును సెబూ విమానయాన సంస్థ తిరిగి చెల్లించనుంది.
కాగా, బాధిత ప్రయాణీకులకు సహాయం చేస్తూనే విమానాశ్రయంలో 'సాధ్యమైనంత త్వరగా విద్యుత్ కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించాలని రవాణా కార్యదర్శి జైమ్ బటిస్టాను ఫిలీప్పిన్స్ ప్రెసిడెంట్ జూనియర్ ఫెర్డినాండ్ మార్కోస్ ఆదేశించినట్లు అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ ఏడాదిలో ఇలా విమానాలు రద్దవ్వడం ఇది రెండోసారి. గతంలో ఈ ఏడాది జనవరిలోనే విమానాశ్రయంలోని విద్యుత్ అంతరాయం వల్ల ఏకంగా 300 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ సమయంలో 65 వేల మంది ప్రయాణీకులపై ఆ ప్రభావం పడింది. సౌకర్యాల లేమి, విమానాలు రద్దు వంటి పేలవమైన రికార్డులతో ప్రపంచంలోనే మనీలా విమానాశ్రయం ఉన్నట్లు కాలిఫోర్నియాకు చెందిన లగేజ్ స్టోరేజ్ యాప్ బౌన్స్ ర్యాంకింగ్ వెల్లడించింది.