
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటి పేరు మార్పుపై చంద్రబాబు గవర్నరును కలిసి వచ్చిన తర్వాత అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా జిల్లాకు ఎన్‌టిఆర్ పేరు పెట్టామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వతహాగా వైద్యులుగా ప్రజలకు సేవలు అందించడంతోపాటు ముఖ్యమంత్రిగా వైద్యరంగంలో చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పుపై శాసనసభలో చర్చ జరిగేటప్పుడు చంద్రబాబు సభకు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.