Nov 21,2022 07:56

పందులు దొర్లిన బురదగుంటలాంటి వ్యవస్థలో ..
నీ యింటి ముందు కాలువలు మురుగు కంపు కొడతాయి
అయినా ముక్కుపుటాలు మూసుకోవాలే తప్ప
ఇదేంటని అడగ్గూడదు
చినుకుపడితే చాలు, వేనవేల నీటిఅద్దాలై మెరిసే
గతుకుల రోడ్డును ముద్దాడి నీ కొడుకు నెత్తుటిపిట్టవుతాడు
ఖర్మ అనీ సరిపెట్టుకోవాలే తప్ప ఇదేమని ప్రశ్నించకూడదు
చీమలపుట్టలోకి పాములు దూరినట్టు
ఒంటికి మతాన్నీ .. కళ్లకు కులాన్నీ పులుముకొనీ
అర్ధరాత్రి నీ యింటిలోకి అరాచకవాదులు చొరబడతారు
శిలల్లా నిలబడిపోవాలేగానీ శిరసెత్తి మాట్లాడకూడదు
మరుగుదొడ్డికి పోయినట్టు .. నీ మునివాకిట
గుమ్మం ముందు ఎవడో మూత్రం పోసిపోతాడు
ముక్కూనోరు మూసుకోవాలే తప్ప గొంతు పెగలకూడదు
వీధుల్లో యధేచ్ఛగా రంకెలేస్తున్న మదపుగిట్టల కింద
నీ నట్టింట పూసిన లేతపూవు నలిగిపోతుంది
అయినా దు:ఖాన్ని దిగమింగుకోవాలే తప్ప
ఏంటీ దారుణమనీ ఎదిరించగూడదు
నీ ముందే ఎవడో కిరాతకుడు
పావురాల్ని పాశవికంగా వేటాడతాడు
గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకోవాలే తప్ప
ఏంటీ అరాచకమనీ లోన అనుకోగూడదు !

ఒకసారి ఓటేసాక ..
నీ చూపుడువేలు మీద నల్లనాగు కాటేసాక ..
యిక నీవు నవరంధ్రాలూ మూసుకోవాల్సిందే!
నోరు కుట్టుకొని బతకాల్సిందే
తలకుండను మోకాళ ్లకుదురు మీద దించుకోవాల్సిందే
ఏంటీ అరాచకమని ప్రశ్నించావా ..?
రాత్రికి రాత్రే నీవు రాజద్రోహివై పోతావు
ఉన్నట్టుండి నీ యింట్లో భయపెట్టే సాహిత్యం దొరుకుతుంది
ఇనుపబూట్ల కవాతు నీ ఇంటిచుట్టూ సాగుతుంది
విచారణ కోసం లాకప్‌ నిన్ను పిలుస్తుంది
వేటకుక్కలొచ్చి నీ వంటగదిని వాసన చూస్తాయి
సాక్ష్యాలు నిన్నే నేరస్తుడంటాయి
న్యాయస్థానాలు నిన్ను దోషిగా తేల్చేస్తాయి
ప్రసార మాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాదిగా ప్రకటిస్తాయి
అర్ధరాత్రి బుల్డోజరొచ్చీ నీ యింటిని కూల్చేస్తుంది
నీ తాతలనాటి ఆస్తుల్ని రాజ్యం తన్నుకుపోతుంది
నేలమీద నీ ఉనికి ప్రశ్నార్ధకమవుతుంది
యేళ్ల కొద్దీ ఉక్కు పంజరాల్లో ముగ్గబెట్టీ
చివరికి నీ శవాన్ని నీకే బహుమతిగా యిస్తారు !

వాళ్లు .. చీకటిరాజ్యపు వికృత నీడలు
అధికారం వాళ్ల అడుగులకు మడుగులొత్తుతుంది
తుపాకీ దడులుగట్టి సైన్యం పహారాకాస్తుంది
నీవొక్కడివే .. నిరాయుధుడువే ..
అయినా వాళ్లకు నీవంటే భయం
కొడవళ్లలాంటి నీ ప్రశ్నలంటే భయం
నీ ఆలోచనంటే భయం ..
మెదళ్ల మహా విస్పోటనమంటే భయం
ఒక మహా యుద్ధంలాంటి నీ మాటంటే మరీ భయం
ప్రజాక్షేత్రాల్లో విత్తులై వెదజల్లే
నీ భావజాలమంటే యింకా భయం !

సరే అలాగేకానీ .. ఈ గ్రహణకాలంలో
వాళ్లు పొద్దును మింగేసామనుకుంటారుగానీ
మరి గ్రహణం విడిచాక ..?!

- సిరికి స్వామినాయుడు
79897 89893