Jun 27,2022 20:01
  •  లీజుదారులు, అధికారులతో సమన్వయ కమిటీ
  •  మైనింగ్‌ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు, ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకే మైనింగ్‌ రంగంలో ఇ-ఆక్షన్‌ విధానం తీసుకొచ్చామని, ఈ రంగంలో సిఎం జగన్‌ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని గనులు, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం డిఎంజి కార్యాలయంలో మైనింగ్‌ లీజుదారులతో మైనింగ్‌ విధానాల అమలుపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైనింగ్‌ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై లీజుదారుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. లీజుదారులు, గనులశాఖ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ నెల నుంచి రెండు నెలల్లో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి, అన్ని కోణాల్లోనూ చర్చించి మైనింగ్‌ రంగం ప్రగతికి సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. కమిటీ నివేదికను సిఎంకు సమర్పించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గతంలో ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌-సెర్వ్‌ అనే విధానం ద్వారా మైనింగ్‌ లీజులు జారీ అయ్యేవని, ఈ విధానంలో పలు ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,988 లీజులుండగా, వాటిలో కేవలం 2,826 మాత్రమే వర్కింగ్‌ లీజులుగా ఉన్నాయని, మరో 2,162 నాన్‌ వర్కింగ్‌ లీజులు ఉన్నాయన్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడుతోందని, మరోవైపు మైనింగ్‌ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడుతోందని తెలిపారు. మైనింగ్‌లో అందరికీ అవకాశాలు కల్పించాలని జిఓ 65 ద్వారా పదిరెట్లు వార్షిక డెడ్‌ రెంట్‌ చెల్లించే వారికి లీజులు జారీ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ సమావేశంలో మైన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి వెంకటరెడ్డి, 13 జిల్లాల మైనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.